
వైద్యులకు నెలకు 2 లక్షల 25వేల రూపాయిల ప్యాకేజీని ప్రకటించినప్పటికి పూణేలో వైద్యుల కొరత అలాగే ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మంత్రి రాజేష్ తోపే మీడియాతో మాట్లాడుతూ.. పూణెకు 213 మంది వైద్యుల అవసరం ఉందని, నెలకు 2 లక్షల 25 వేల ప్యాకేజీని అందిస్తున్నప్పటికీ ఎలాంటి దరఖాస్తులు అందడం లేదన్నారు. దీంతో వెంటనే తాజా నియామక ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పూణేలో ఆస్పత్రుల్లో ప్రధానంగా పడకల సమస్య ఉందని తోపే తెలిపారు. రెండు రోజులు పూణెలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తామని, అలాగే ట్రస్ట్ ఆసుపత్రుల యజమానులతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అంతేగాక భారీ సామర్థ్యం ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా సమవేశం నిర్వహించి, ఆక్సిజన్ ప్లాంట్లను కూడా సందర్శిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో కూడా వెంటనే ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచేందుకు వైద్యులను, ఐసీయులో పడకల సామర్థ్యంతో పాటు టెలి ఐసీయు సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.