
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ సుస్థిరతకు ఎటువంటి ఢోకా లేదు. పైగా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి మార్చవలసిన అవసరం కూడా ఆ పార్టీకి లేదు. అయితే త్వరలో రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి వస్తున్నట్లు, అది కూడా ఆ పార్టీ వర్గాల నుండే ట్వీట్ రావడం అధికార పార్టీలో కల్లోలం రేపుతున్నది.
అధికారిక పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో ‘రాష్ట్రానికి త్వరలో మహిళా ముఖ్యమంత్రి రానున్నారు’ అంటూ ట్వీట్ చేసి కొద్ది సేపటికే దాన్ని తొలగించారట. అయితే అప్పటికే కొందరు ఆయన ట్విట్టర్ ఫాలోవర్లు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇతర ఖాతాల్లో షేర్ చేయడంతో ఆ విషయం ఇప్పుడు పార్టీలో దావానలంలా వ్యాపించింది. పార్టీలో అన్ని స్థాయిలలో ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ నాయకుడు పార్టీలో చాలా కాలంగా ఉండడమే కాకుండా పార్టీలో కీలకనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. ఈ ట్విట్టర్‌లో నాయకుడు చేసిన ట్వీట్‌లో పేర్కొన్న మహిళా ముఖ్యమంత్రి ఎవరు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి ఏంటి అనే విషయంలో తీవ్ర ఆసక్తి వ్యక్తం అవుతున్నది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గత వారం రోజులుగా చేస్తున్న ఆరోపణలు సైతం వీరి చర్చలో భాగమతుండడం గమనార్హం. అరబ్ దేశానికి చెందిన కంపెనీ త్వరలో సీఎం జగన్‌ను తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని బోండా ఉమా వంటి టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
ఆ కంపెనీ తరఫున అరబ్ దేశం జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే గత జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పగించాల్సి వస్తుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇంత వరకూ వైసిపి సీనియర్ నాయకులు ఎవరూ ఖండించక పోవడం గమనార్హం. పైగా, ఈ ట్వీట్ ను కూడా ఎవ్వరు ఖండించకపోవడంతో ఈ విషయం వైసిపి నాయకులలో గందరగోళం సృష్టిస్తున్నది.
అంతేగాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై న్యాయ స్థానాలు విచారిస్తున్న అక్రమ ఆస్తుల కేసులు కూడా త్వరలో విచారణ పూర్తయి తీర్పు వచ్చే అవకాశం ఉందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో మొత్తం మీద పార్టీలో ఏదో జరుగుతోందని వైసీపీ నేతలు కలవరం చెందుతున్నట్లు కనిపిస్తున్నది.
ఇక పార్టీ నేత ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు మహిళా ముఖ్యమంత్రి ఎవరన్న అంశం కూడా చర్చకు వస్తోంది. దీంతో కొందరు వైఎస్ భారతి అంటూ అభిప్రాయపడుతుండగా మరి కొందరు షర్మిల అంటూ వాదిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఖాయమని చర్చలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది సంబరాలు చేసుకునే అవకాశం వస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.