
లాక్ డౌన్ వల్ల మందుబాబుల పరిస్థితి “కుడితిలో పడ్డ ఎలుక”లా అయిపోయింది. తెలుగు రాష్ట్రాలలో మందుకు బానిసైన కొందరు వ్యక్తులు ప్రాణాలు తీసుకోగా, మరికొందరు పిచ్చిపట్టిన వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు మొత్తం దేశమంతటా మందుబాబుల పరిస్థితి ఇదే.
ఇటీవల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి సుమారు 15మంది రోగులు చికిస్త కోసం వచ్చారు. మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మందుబాబులు విచిత్ర ప్రవర్తన చేస్తున్నారని డాక్టర్లు తెలుపుతున్నారు.
నిత్యం మద్యం అలవాటున్న ఉన్న వ్యక్తులకు ఒక్కసారిగా దొరక్కపోవడం వల్ల అసాధారణంగా ప్రవర్తిస్తారు. కొందరికి శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ముదిరి రోగి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తారన్నారు. ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులను గాయపర్చడం, వారికి వారే గాయపర్చుకోవడం లాంటివి చేస్తారని డాక్టర్లు తెలిపారు.
అయితే మందుకు బానిసలైనవారి పరిస్థితిని అర్థం చేసుకున్న మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మారీ.. రాష్ట్ర సీఎంకు ఓ లేఖ రాశారు. వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం కొన్రాడ్ కె. సంగ్మాను శుక్రవారం లేఖలో అభ్యర్థించారు.
మావ్రీ తన లేఖలో మద్యపానం రాష్ట్రంలో “జీవన విధానం” కాబట్టి వైన్ షాపులు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇతర నిత్యావసర వస్తువులతో పాటు కేటాయించిన సమయంలో వైన్ షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంగ్మాను కోరారు. మద్యం కొనుగోలు చేసేవారు సామాజిక దూరం, పరిశుభ్రత మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తారని ఆయన హామి ఇచ్చారు. అయితే ఎర్నెస్ట్ మారీ.. ప్రస్తుతం ఖాసీ హిల్స్ వైన్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. అందుకే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.