
ఏపీలోని పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దింతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో.. అర్థమౌతోంది. అంతేకాకుండా సీఎం చర్యతో అనేకకోట్ల ప్రజాధనం వృధా అవుతోంది.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే..ఆ పార్టీ ప్రతిభింబిచేలా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ గుర్తులతో నింపేయడం సర్వసాధారణం. కానీ ఏపీ అధికారపార్టీ వైసీపీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ..గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండాకి వైసీపీ జెండా రంగులు వేయడం, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జగన్ బొమ్మలను వేసి విమర్శల పాలైంది.
ఇదే అంశంపై ముప్పా వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో.. హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై జస్టిస్ నాగేశ్వరరావు స్పందిస్తూ…‘అలా ఎలా చెప్తారు? అధికారంలోకి వచ్చిన వారు వారి పార్టీ గుర్తులు ప్రభుత్వ కార్యాలయాలకు వేసుకుంటూ పోతే ఎలా? కేంద్ర సంస్థలకు కాషాయ రంగు వేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులకు నేషనల్ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూ పిటిషన్ కొట్టివేసింది.
దింతో వైసీపీ పార్టీ రంగుల పంచాయితీకి తెరపడినట్లయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయితీ కార్యాలయాలలో వైసీపీ వేసిన రంగులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో మరో రంగు వేయడానికి అనేక కోట్ల ప్రజాధనం వేస్ట్ అవుతోందని అనేకమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.