
వేమన ఒక పద్యం రాస్తూ..”పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నాడు. స్వతంత్ర భారతావనిలో ముగ్గురు న్యాయమూర్తులకు ఆ వ్యాఖ్యానం బాగా సెట్ అయ్యిది. సర్వోన్నత న్యాయస్థానానికి మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జే కనియా నుంచి ప్రస్తుత న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్దే వరకు 47మంది ప్రధానన్యాయమూర్తులుగా పనిచేసారు. ఈ 47మందిలో 21వ న్యాయ మూర్తిగా పనిచేసిన బహరూల్ ఇస్లాం, 25వ న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రా, 46వ న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ లు వేరు. వారు మాత్రమే పెద్దల సభకు ఎందుకు నామినేట్ అయ్యారో తెలుసుకుంటే కొన్ని నమ్మలేని నిజాలు బయట పడతాయి. నల్లటి వస్త్రం తో న్యాయదేవత కళ్ళకు ఎందుకు గంతలు కట్టారో తెలుసుకోవచ్చు. న్యాయానికి,చట్టానికి జరిగిన సంగ్రామంలో అలనాటి కేంద్ర ప్రభుత్వాలు ఎలా లబ్ది పొద్దయో తెలిసికోవచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాన్ని, న్యాయంగా మలిచిన మాజీ ప్రధాన న్యాయమూర్తులను పెద్దల సభకు నామినేట్ చేసి న్యాయవ్యవస్థ స్వాతంత్రాన్ని, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఎలా దెబ్బ తీసారో తెలుసుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే…1980లో పట్టణ సహకార బ్యాంకు కుంభకోణంలో అప్పటి కాంగ్రెస్ బీహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఈ కేసులో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న బహారుల్ ఇస్లాం కాంగ్రెస్ సీఎం కి అనుకూలమైన తీర్పు ఇచ్చారు. ఆ తరువాత 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి రాజ్యసభకు వెళ్లారు.
ఇందిరా గాంధీ హత్యకు సంబంధించి1984లో అల్లర్లు చెలరేగి వేలమంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది నేతలపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు, కానీ ఆ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చారు ఆనాటి సుప్రీంకోర్టు జడ్జి రంగనాథ్ మిశ్రా. ఇదే జడ్జి 1998లో కాంగ్రెస్ తరుపున రాజ్యసభకు ఎంపిక అయ్యారు.
ప్రస్తుతం మాజీ సిజేఐ రంజన్ గొగోయ్ పెద్దల సభకు ఎంపిక కావడం, దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈయన బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపిక అయ్యారు. మరి ఈయన బీజేపీ కి ఏమైనా చేశారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు సంబంధించి మోడీ సర్కార్ పై అభియోగాలు ఉన్నాయి. కానీ రంజన్ గొగోయ్ బీజేపీ ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చారనే మాటవినబడుతోంది. అంతేకాకుండా అయోధ్య రామమందిరం వివాదం, 370 ఆర్టికల్ రద్దుకు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక తీర్పులలో మోడీ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారనే టాక్ వినబడుతోంది.
ఏది ఏమైనా ఎంతోమంది న్యాయమూర్తులకు లేని భాగ్యం ఇలా కొంతమందికి మాత్రమే రావడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. “న్యాయమూర్తులు, పదవిలో ఉన్నప్పుడు ఇచ్చే తీర్పే.. పదవీ విరమణ తర్వాత వారి పదవులను నిర్ణయిస్తాయి” అనే అరుణ్ జైట్లీ మాటలు ఇప్పుడు అనేక మంది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.