“బతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చు” ఈ సిటీ లో నేను ఉండలేను. “ఇంత బ్రతుకు బ్రతికి ఈ దిక్కులేని చావు నేను చావను” అనుకుంటూ మూట ముళ్లే సర్దుకొని రాజధానిని విడిచిపెట్టి సొంతూళ్లకు బయల్దేరుతున్నారు నగర వాసులు. తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులతో జనాల్లోనూ ఆందోళన మొదలయింది. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారనే ప్రభుత్వ సంకేతాలతో.. చాలా మంది మళ్లీ సొంతూళ్ల బాటపట్టారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. లాక్ డౌన్ ప్రకటిస్తే ఇక్కడే చిక్కుకుపోతామని భావించి.. ముందే అప్రమత్తమై.. బస్సులు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవుతున్నారు. అంతేకాదు హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కేసులు కూడా ఒక కారణం. ఇక్కడే ఉంటే తమకూ కరోనా సోకుతుందేమోనని భయపడిపోతున్నారు. అందుకే సొంతూళ్లకు వెళ్లి గంజీ నీళ్లు తాగైనా బతుకుతామని మళ్లీ ఊరిబాట పట్టారు.
మరోవైపు గ్రామీణ ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలు మళ్లీ అష్ట దిగ్బంధనంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారిపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చాటింపు వేయిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్లైతే హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని గ్రామంలోకి రానీయడం లేదు. మరికొన్ని గ్రామాల్లో 14 రోజులు హోంక్వారంటైన్ లో ఉండాలని నిబంధనలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వలస జీవులు హైదరాబాద్ లో ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 14,419 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,172 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 247 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 82,458 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పరిధిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.