
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ లో చాలా బిజీగా ఉన్నాడు. అన్ని కోణాల్లోనుంచి వైసీపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటి వరకు చేసిన ప్రతి విమర్శలకు బహు ధీటుగా స్పందిస్తూ తనదైన రీతిలో దూసుకెళ్తున్నాడు.
గత నెల ఇసుక సమస్య పై పోరాడిన జనసేనాని ఇప్పుడు, ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై స్పందిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు చేసిన విమర్శలను కూడా ఖండిస్తున్నారు. ప్రస్తుతం జగన్ యొక్క మతం-కులం గూర్చి ఘాటు విమర్శలు చేస్తున్నారు. పవన్ చేసిన విమర్శలకు స్పందిస్తూ … మొన్న గుంటూరు లో ” వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా” కార్యక్రమం లో జగన్ మాట్లాడుతూ.. తన మతం “మానవత్వం” అని అలాగే తన కులం “మాట నిలబెట్టుకునే కులం” అని చెప్పడం జరిగింది. తదనంతరం పవన్ మాట్లాడుతూ… జగన్ కులం “రెడ్డి” అని, క్రిస్టియన్ గా మారిన తర్వాత ఆ కులాన్ని మార్చుకోవాలి లేకుంటే మతం మార్చుకోవాలి అన్న రీతిలో స్పందిస్తున్నారు.
ఇసుక సమస్యపై పోరాటం, ఇంగ్లిష్ మీడియంపై విమర్శలు చెయ్యడం తో పవన్ కి ఎంతో కొంత జనాదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని… ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నతమైన స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన స్థాయిని దిగజార్చుకునే విధంగా ఎదుటి వ్యక్తుల (వారు ఎవరైనప్పటికీ) కులం గురించి లేదా మతం గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఒకవిధంగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ.. బలమైన వైసీపీ ప్రభుత్వం పై ఎదో ఒక విమర్శ చేస్తూ… జనాలకు మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో… ఎప్పుడూ చేసినట్లే తన తొందరపాటు తనంతో (కుల-మత విమర్శలతో) జనాలకు దూరమవుతున్నాడా? అనిపిస్తుంది.
ఏది ఏమైనప్పటికి చంద్రబాబు కి మించి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు అనటంలో సందేహం లేదు.