
ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మించి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని అమ్మి సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ప్రభుత్వానికి తగినంత ఆదాయం కూడా లేదనేది సర్కార్ వాదన. కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని ఎవరు ఆక్రమించుకోకుండా ఉండాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. ప్రభుత్వ భూమిని అమ్మక తప్పదు అని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నది. అయితే ఈ వాదనల పై నిజ నిజాలను ఇప్పుడు చూద్దాం..
అమ్మకం పై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరియైనది కాదనేది అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం. 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి అసలు ప్రభుత్వ భూమిని అమ్మే హక్కు లేదు. ఒక ఇంటి యజమాని ఇల్లు అమ్ముకొని దాన ధర్మాలు చేస్తే… ప్రస్తుతం బాగుంటుంది కానీ తర్వాత వచ్చే తరాలు ఎలా బ్రతుకుతాయి..? అని కూడా ఆలోచించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వరంగ స్కూల్స్, కాలేజీలకు, ఆసుపత్రులకు, బస్సు డిపోలకు, అంగన్ వాడీలకు, కార్యాలయాలకు ఉన్న స్థలం, 30, 40 లేదా 50 సంవత్సరాల తర్వాత కూడా సరిపోతుందా… ? కచ్చితంగా సరిపోదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అమ్ముకోవడం ఎందుకు?. ఇప్పుడు స్థలాలు అమ్ముకొని అప్పుడు కొనుకోవచ్చు అన్నట్లయితే.. ఇప్పుడున్న స్థలాల రేట్ల అప్పటికి పెరిగిపోతే కొనడం కష్టమౌతుంది కదా..! తెలుగు లో ఒక సామెత ఉంది.. “అమ్మబోతే అడవి-కొనబోతే కొరివి” అని అలానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడం అనేది మంచిది కాదు.
అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతుంది కాబట్టి అమ్ముతాము అంటున్నారు. భూములనే కాపాడటం చేతకాకపోతే ఇక రాష్ట్రాన్ని ఏమి కాపాడతారు? రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతారు? అయినా ఉన్న స్థలం నుండి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలి గాని అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదు.