
పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎప్పటిలాగే అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తున్నాడు. నవంబర్ మొదటివారంలో వైజాగ్ లో ప్రదర్శన తీస్తాడట. భవన కార్మికుల సమస్యలపై ఈ నిరసన ప్రదర్శన ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇసుక కొరతతో నిర్మాణరంగం కుదేలయింది కాబట్టి ఈ ప్రదర్శన ఉంటుందని తెలుస్తుంది. ( అప్పటికి ఈ ఇసుక కొరత వుంటే మరి). కానీ ఇప్పటికే ఈ సమస్యపై తెలుగు దేశం పెద్దఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారానికి వూతంగానా లేక స్వతంత్రంగానా అనేది ప్రజల మనస్సులో తొలుస్తున్న ప్రశ్న.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజు ఉండేది. మొదటి సారి ఎన్నికల్లో పోటీచేయకుండా తెలుగుదేశం-బీజేపీ కి మద్దతిచ్చాడు. తర్వాత నాలుగు సంవత్సరాలు అప్పుడప్పుడూ నేనూ వున్నానని ప్రకటనలతో, చంద్రబాబుతో ఒకటి రెండు సార్లు సమావేశాలతో గడిచిపోయింది. ఎన్నికల సంవత్సరం రంగంలోకి దిగాడు. మరి ప్లానింగ్ లో లోపమో లేక మరే కారణమో తెలియదుకానీ అన్ని జిల్లాలు పర్యటించలేకపోయాడు. కేవలం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే విస్తారంగా అంటే అన్ని మండలాలకు వెళ్లగలిగాడు. మూడో ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలను కలవటం మొట్టమొదట చేయాల్సిన పని. అదే నెరవేరలేదంటే ఎక్కడో లోపముంది. అది నాయకుడులోనా మరే కారణమా అనేది విశ్లేషించాలి. మొత్తం రాష్ట్రం విస్తృతంగా పర్యటించటానికి ఎంత టైం పడుతుందో నాయకుడికి తెలియదని అనుకోలేము. మరి ఎందుకు ముందుగా క్యాంపైన్ మొదలుపెట్టలేదో పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాతకూడా ప్రజలకు చెప్పలేదు.
రెండోది, అందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న . ఎన్నికలకు వారం ముందుగా ఒక్కసారి ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ నుంచి జగన్ వైపు ఎక్కుపెట్టాడో ఈరోజుకీ వివరణ ఇవ్వలేదు. మంగళగిరి సీటు పోటీపెట్టకుండా సిపిఐ కి కేటాయించినప్పుడే అభిమానులు కంగుతిన్నారు. అసలు మంగళగిరి విషయంలో సిపిఐ నారాయణ తో చంద్రబాబు నాయుడు లాబీ చేసి ఆ సీటు పట్టుబట్టేటట్టు తెరవెనుక రాజకీయం చేసాడని తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సిపిఐ తోటి అడిగించుకొని సీటు వదిలేసాడని అనుకుంటున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన చింతల పార్ధసారధి ఇంటర్వ్యూ చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి పారదర్శకంగా లేకపోవటంతో ఈ అనుమానాలే నిజమని ప్రజలు, అభిమానుల్లో ఒకవర్గం నమ్ముతుంది. ఈరోజుకీ ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ముఖ్య అనుచరుల్లో ఒక్కొక్కరూ వెళ్ళిపోవటం, వెళ్ళిపోతూ వాళ్లు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇందులో ఎంతోకొంత నిజముందని అనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఎన్నో కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చాడని అందువలన ఆయనలాంటి నిస్వార్ధపరుణ్ణి సపోర్ట్ చేయాలని ఆయన్ని అభిమానించే ప్రజానీకం ఇప్పటికీ చెబుతున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ స్ఫూర్తిని ఎవరైనా అభినందించాలి. అయితే సమస్యల్లా ఎన్నికల్లో గెలవటానికి, రాజకీయాల్లో రాణించటానికీ ఆ క్వాలిటీ ఒక్కటే సరిపోదు. ఉదాహరణకు మోడీ, మన్మోహన్ సింగ్ ఇద్దరూ వ్యక్తిగతంగా అవినీతిపరులు కాదని ప్రజలు ఈరోజుకీ విశ్వసిస్తున్నారు. కానీ ప్రజలు మోడీకే పట్టంకట్టారు, కడుతున్నారు. కారణం ఆయనకు దేశ సమస్యలపై వున్న దార్శనికత , దృఢ నిర్ణయాత్మక శక్తి , రాజకీయ చాణక్యం అన్నీ కలగలిపి ఆయనకు నీరాజనం పడుతున్నారు. వాటితో పాటు తన నిజాయితీ అదనపు విలువను జోడిస్తుంది. కాబట్టి ప్రజా క్షేత్రం లో నిలదొక్కుకోవటానికి నిజాయితీతో పాటు ప్రజలను, రాజకీయాలను నడిపించగల సామర్ధ్యం చాలా అవసరం. నాయకత్వ సామర్ధ్యంతో పాటు నిజాయితీ , ప్రజాకర్షణ అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. మొట్టమొదట కావాల్సింది ప్రజలకు నాయకుడిమీద నమ్మకం కుదరాలి. తనతో నడిచే క్యాడర్ కు పూర్తి విశ్వాసం ఉండాలి. తను తీసుకున్న కొన్ని వైఖరులు ప్రజల్లో అనుమానాలకు దారితీసినప్పుడు తను అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో, ఎందుకు వ్యవహరించవలిసి వచ్చిందో ఎప్పటికప్పుడు పారదర్శకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అంతేగాని ఆ అవసరం నాకు లేదనుకుంటే పొరపాటు. నిన్నే నమ్ముకొని నడిచిన వ్యక్తులు ఒక్కొక్కరూ దూరమవుతుంటే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతేగాని నేను నిజాయితీ పరుణ్ణి ఎవరు వెళ్లినా పర్వాలేదు నా వెనుక జనం వున్నారనుకుంటే అది ఆత్మహత్య సదృశ్యకమవుతుంది. పవన్ కళ్యాణ్ ముందుగా ప్రజలకు అందుబాటులో , పిలిస్తే పలికే విధంగా ఉండేటట్లు మారితేనే రాజకీయాల్లో రాణిస్తాడు. ఆ లోపాన్ని సరిదిద్దుకోకుండా ఇలానే ముందుకు వెళితే 2019 ఫలితమే తిరిగి రిపీట్ అవుతుంది. ఒక శ్రేయోభిలాషిగానే ఈ విమర్శ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజుల్లో రాజకీయాల్లో నిజాయితీ అనేది భూతద్దం వేసి వెదికినా కన్పించటం లేదు. ఆ అరుదైన క్వాలిటీ వున్న పవన్ కళ్యాణ్ ఫెయిల్ కాకూడదనే భావనతోనే ఈ విమర్శ చేస్తున్నాం. దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిద్దాం.