
దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయనిపిస్తుంది. పౌరసత్వ చట్టం దీనికి నాంది కాబోతుందా? అవుననే అనిపిస్తుంది. కాంగ్రెస్ అనుకున్నదొకటి అయినదొకటిలాగా వుంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని లబ్ది పొందాలని అనుకున్నా మొత్తం ఆందోళన ఇప్పుడు ముస్లిం మత సంస్థల చేతుల్లోకి వెళ్ళింది. ఇది ఆందోళనకర విషయం. పైకి చూడటానికి కాంగ్రెస్ కి అన్నీ అనుకూలంగా అనిపిస్తున్నా లోపల కాంగ్రెస్ కి భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అదేంటో చూద్దాం.
ఇప్పటివరకు దేశరాజకీయాల్లో ముస్లింలు కాంగ్రెస్ గొడుగు కిందగాని, ప్రాంతీయపార్టీలైన సమాజ్ వాది , ఆర్జేడీ , టీఎంసీ లాంటి పార్టీల కిందగాని సమీకరించబడుతున్నారు. మొట్టమొదటిసారి ముస్లింలు స్వతంత్రంగా ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రేరేపిత ఆందోళన కాదు. మొదట్లో అగ్గిరాజేయటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసినమాట వాస్తవం. కానీ ఇప్పటి ఆందోళన ప్రతిపక్ష పార్టీల చేతుల్లోనుంచి మత సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది వాస్తవం. ఇది స్వతంత్రం తర్వాత అతి పెద్ద మార్పుగా భావించవచ్చు. అయితే ఇప్పటివరకు దీనికి ఒక నాయకుడంటూ లేడు . ముందు ముందు ఈ ఆందోళనలోనుంచే వచ్చే అవకాశం వుంది. ముఖ్యంగా దళిత్-ముస్లిం ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు దేశంలో మెండుగా వున్నాయనిపిస్తుంది.
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే స్వాతంత్రానికి ముందు ముస్లింలు స్వతంత్ర సంస్థలు కలిగివుండేవి. పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ ముస్లిం ఆధిక్యతలో ఉండేది. అలాగే తూర్పులో బెంగాల్లో కూడా రాను రానూ ముస్లింలు స్వతంత్ర సంస్థల్లో ఉండేవారు. విభజన తర్వాత ముస్లిం మెజారిటీ ప్రాంతాలు పాకిస్తాన్ కి వెళ్లిపోవటంతో ఇక్కడేవున్న ముస్లింలు కాంగ్రెస్ కిందనే వున్నారు. బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత ముస్లింలు కాంగ్రెస్ కి దూరంగా జరిగారు. అలాగే బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రం లో ముస్లింలు సిపిఎం కింద వుండి టీఎంసీ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయారు. అస్సాం లో మొదట్నుంచి కాంగ్రెస్ కింద వున్నా గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం స్వతంత్ర పార్టీ అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కింద ఎక్కువమంది సమీకరించబడ్డారు. ప్రస్తుతానికి బెంగాల్, అస్సాం లో ఇప్పుడున్న సమీకరణాల్లో ముస్లింల లో మార్పు రాకపోయినా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో సమీకరణాల్లో మార్పులొచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇదే జరిగితే రాజకీయాల్లో పెనుమార్పుగానే పరిగణించవచ్చు.
ఇప్పుడే అందినవార్తల ప్రకారం ఝార్ఖండ్ లో బీజేపీ ఓడిపోయి జేఎంఎం -కాంగ్రెస్ -ఆర్జేడీ అధికారంలోకి రావచ్చని తెలుస్తుంది. ఒకవేళ అదిజరిగినా కాంగ్రెస్ కి పెద్ద ఒరిగేమీ లేదు. కాంగ్రెస్ అక్కడ మైనర్ పార్ట్నర్ మాత్రమే. కాంగ్రెస్ దేశంలో తిరిగి అతి పెద్ద పార్టీగా ఏర్పడే అవకాశాలు కన్పించటం లేదు. సమీప భవిష్యత్తులో బీజేపీ నే అతిపెద్ద జాతీయ పార్టీగా ఉండబోతుంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ల్లో ఎక్కడా మెజారిటీ మాట అటుంచి కనీసం పెద్ద పార్టీగా కూడా ఎదగలేక పోతుంది. కాబట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరమే. ఒకవేళ నిజంగానే ముస్లింలు దళితులూ ఒకటై కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ కి ఇప్పుడున్న అవకాశాలు కూడా వుండవు. జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కి పెద్ద దెబ్బగానే భావించాలి. ఈ ఆందోళన నుంచి రాబోయే పరిణామాలు ఎలావుంటాయో వేచి చూద్దాం.