
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటినుంచి టీడీపీ హయాంలో రాజధాని విషయంలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం టీడీపీ నేతలను మరీ ఇబ్బంది పెడుతుంది. చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని ఏర్పాటు పథకం ప్రకారమే జరిగిందని అందులో భాగంగానే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో మనీల్యాండరింగ్ జరిగిందని ఈడీ ప్రివెన్షన్ అఫ్ మనీ ల్యాండరింగ్ ఆక్ట్ (పిఎంఎల్ఏ)కేసు నమోదు చేసింది.
ఒకవైపు మంత్రి ఉపసంఘం నివేదిక మరోవైపు సిబిఐ ఇచ్చిన ఆధారాలతో టీడీపీపై కేసు పెట్టడం జరిగింది. 797మంది తెల్లరేషన్ కార్డు ఉన్న పేదల పేర్ల పై వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నట్లు సిబిఐ గుర్తించి, తగిన నివేదికను ఆధారాలతో సహా ఈడీకి అందజేసింది.
2014 జూన్ నుంచి డిశంబర్ మధ్య కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 4వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రి వర్గం నిగ్గుతేల్చింది. అందులో తెల్లరేషన్ కార్డు దారులు దాదాపు 760 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లు ఏసిబిఐ ఆధారాలు స్వీకరించింది.