
హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రయత్నం మానుకున్నారు. దానికి బదులు కొత్త గా అదనంగా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే ఇటీవల బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన మణికొండ దానిచుట్టుపక్కల ప్రాంతాలను జిహెచ్ ఎంసీ లో కలుపుతున్నారు. ఈ రెండు పరిణామాలు ఆహ్వానించదగ్గవిగానే వున్నాయి. నిన్న అనుకున్నట్లు హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లగా చేసే ఆలోచనను విరమించుకున్నట్లే చెప్పాలి. మూడు కార్పొరేషన్ల ఆలోచన ఢిల్లీ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని విరమించుకొని ముంబై మోడల్ ని తెరపైకి తెచ్చారు.
ఓ విధంగా ఇది మంచిదే. శివారు ప్రాంతాలు మొత్తం ఒకేసారి హైదరాబాద్ లో కలిపితే చాలా సమస్యలు వచ్చే అవకాశం వుంది. శివారు ప్రాంతాలు ఇప్పటివరకు పంచాయతీలో ఉండటంవలన ప్రణాళికలేకుండా , తగిన నగర అనుభవంలేని సిబ్బందితో నడిచాయి. ఒక్కసారి వాటిని హైదరాబాద్ నగరం లో కలిపే బదులు ప్రత్యేకంగా ఉంచటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే అదేసమయంలో ఓ ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చెందాలంటే వాటిని నగరపాలికలు చేయటమే మంచిది.
కెసిఆర్ ఆలోచనలు మిగతావాళ్లకు భిన్నంగా, విన్నూత్నంగా వుంటాయనే దాంట్లో సందేహం లేదు. అయితే అన్నిసార్లు అవి ప్రజారంజకంగా వుండవు. కెసిఆర్ తో వచ్చిన చిక్కల్లా తాను చెప్పిందే వినాలి. పారదర్శకంగా అందరి అభిప్రాయాలు తీసుకుని పోదామనే ఆలోచన తనకు పొసగదు. అంతమాత్రాన తన ఆలోచనలు కొట్టిపారేసేవిగా వుండవు. సమస్యల్లా ‘ సీతయ్య ఎవరిమాటా వినడు’ తోనే . నిజంచెప్పాలంటే తన పధకాలను మిగతా దేశం కాపీ కొడుతోంది. ఎవరు కాదన్నా ఇది నిజం. అంటే సృజనాత్మక ఆలోచనలు వున్నట్లే కదా. కొంచెం మార్చుకొని మిగతా వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటే అందరి మన్ననలను పొందొచ్చు. ఓ విధంగా కెసిఆర్ మంచి నియంత ( benevolent dictator ) గా ఉండటమే ఇష్టపడతాడు. ప్రజలు కూడా తనని అలానే చూస్తున్నారు. ఇప్పటివరకు కెసిఆర్ ని ఆ రకంగా ఇష్టపడుతున్నారు. అయితే ముందు ముందు ఎలా ఉంటుందో మరి.