ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించడంతో ఏపీ రాజధాని మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో లేజిస్టేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ అని జగన్ ప్రకటించారు. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పడం అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ కూడా అమరావతి అంత సురక్షిత ప్రాంతం కాదు అని చెప్పడంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది జగన్ సర్కార్ వాదన. అలాగే ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి, చంద్రబాబు మానస పుత్రిక అని టీడీపీ నేతలు పదే పదే అనడం కూడా జగన్ కి నచ్చకపోవడం, అమరావతితో పాటు మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను కూడా మెప్పించి, టీడీపీ, జనసేనలను ఇరకాటంలో పెట్టాలని జగన్ వ్యూహంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఏపీకి ప్రస్తుతం మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటనతో రాజధాని విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.
నాటి మద్రాసు నుంచి నేటి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో ఎన్నో మార్పులు. మరెన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాలకులు రాజధానిని ఒక్కో నగరానికి మార్చుకుంటూ తిరుగుతున్నారు. తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు మద్రాస్, 1953లో ఆంధ్రరాష్ట్రముగా ఏర్పడినప్పుడు కర్నూలు, 1956 తెలంగాణతో కలిసినప్పుడు హైదరాబాద్, 2014 నుంచి అమరావతి, 2019 జగన్ సీఎం అయ్యాక ప్రస్తుతం మూడు రాజధానులు అని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక స్పష్టమైన రాజధాని లేకుండా పోయింది. పిల్లి తన పిల్లల్ని ఇంటింటికి తిప్పినట్లుగా ఆంధ్ర పాలకులు ఏపీ రాజధానిని పలుచోట్లకు తిప్పుతున్నారు. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు పాలన సౌలభ్యం కోసం ఇలా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. అదేంటోగానీ, స్వాతంత్ర్యానంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో స్థిరత్వం లేని పరిస్థితి కొనసాగింది. డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అదే అయోమయం ఆంధ్రులను వెక్కిరిస్తోంది. ఈ విధంగా ఆంధ్ర ప్రజలకు రాజధాని అందని ద్రాక్షగా మారింది . మరి, సీఎం జగన్ చివరి నిర్ణయం ఇదే అవుతుందా..? లేక రేపు వేరే ఇంకెవరైనా సీఎం అయితే మళ్ళీ మారుస్తారా..? అనేది కాలమే నిర్ణయించాలి.