
మెగాస్టార్ చిరంజీవి పేరు మరలా వినిపిస్తోంది. ఆంధ్రా బీజేపీ లోని కాపు నాయకులు తన ఇంటిముందు క్యూ కడుతున్నారు. నిన్నఅంటే సోమవారం రాత్రి మరోసారి చిరంజీవి ఇంటికి వెళ్లి బీజేపీ లో చేరమని అడిగారని విశ్వసనీయంగా తెలుస్తుంది . తానుగనుక వచ్చేటట్లయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు చిరంజీవి స్పందన ఏంటో తెలియదు. కానీ అప్పుడే ఇది వైరల్ అయ్యింది.
చిరంజీవి గనుక ఒప్పుకొనేటట్లయితే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉంటాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన తో వచ్చే అయిదు సంవత్సరాలు రాజకీయాల్లో వుండాలని పధకాలు రచిస్తుంటే రెండోవైపు చిరంజీవి కనుక బీజేపీ అధ్యక్షుడయితే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. చిరంజీవి కనుక తిరిగి రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన ను అన్నయ్య కోసం విలీనం చేస్తాడా? ఇది అందరి మనస్సుల్లో తొలుస్తున్న ప్రశ్న.
ఇకపోతే అసలు కాపు బీజేపీ నాయకుల ఈ ప్రయత్నం వెనుక సామజిక కోణం ఉందని అందరూ అనుకుంటున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రా రాజకీయాలు చక చకా మారుతున్నాయి. అధికారం కోల్పోయిన ఒక సామాజిక వర్గం బీజేపీ ద్వారా తిరిగి అధికారానికి దగ్గరకావాలని ప్రయత్నం చేయటం అందరికీ తెలిసిందే. అయితే ఇది బీజేపీ లో ఎన్నికలకు ముందే చేరిన కాపు సామాజిక వర్గం నాయకులకు రుచించటం లేదు. తెలుగుదేశం పూర్తిగా కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉందనే వీళ్ళు బీజేపీ ని ఆశ్రయించారు. తిరిగి ఇక్కడా వాళ్ళే వచ్చి ఆధిపత్యం చెలాయించటం ఇష్టం లేకే చిరంజీవిని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అందుకనే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉన్నాయని అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ఇంకా అయిదు సంవత్సరాలు ఎన్నికలు లేవు. అయిదు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరగొచ్చు. ఇంతముందుగా ఇప్పట్నుంచే ఈ రాజకీయ సమీకరణాలు కోకిల ముందే కూసినట్లుందని అనుకుంటున్నారు.