హరీష్ రావు ఇటీవల గోవా లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ని ప్రత్యేకంగా కలిసి బీడీ కట్టలపై పన్ను ఎత్తేయమని కోరాడు. దీనిపై ఆధారపడి కొన్ని లక్షలమంది జీవిస్తున్నారని, వాళ్ళు పేదోళ్ళని అందుకే పన్ను ఎత్తేయాలని కోరాడు. ఇంతకుముందు కూడా తెలంగాణ లో బీడీ కట్టలపై వున్న పుర్రె గుర్తును తొలగించాలని పెద్ద ఆందోళన చేశారు. ఈ డిమాండ్లలో సహేతుకత, హేతుబద్దత ఎంతవుంది. రాజకీయనాయకులు చెబుతున్నట్లు బీడీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలా ?
ప్రభుత్వం సిగరెట్లపై అధికపన్నులు వేస్తుంది. అదేమంటే దాని వినిమయాన్ని తగ్గించటానికాని చెబుతుంది. ఓకే , ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై అంత ప్రేమ ఉండటం అభినందించదగ్గదే. అలాగే ఇటీవల ఇ సిగరెట్లను నిషేదించింది. నాకు ఇప్పటికీ అర్ధంకాని విషయమేమంటే పొగాకుతో పోల్చుకుంటే అంత హానికాని ఇ సిగరెట్టు నిషేదించినప్పుడు పొగాకు ఉత్పత్తులు ఎందుకు నిషేదించకూడదు. పొగాకు పంటను నిషేధిస్తే సరిపోతుందికదా. అది చేయకపోగా పొగాకుపంట వేసిన రైతుకి అందరితోపాటు ఎరువుల సబ్సిడీ, నగదు సబ్సిడీ ( కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్, తెలంగాణా రైతు బంధు, ఆంధ్ర రైతు భరోసా ) ఇస్తూ పొగాకు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ అది సిగరెట్టుగా మారిన తర్వాత వినిమయాన్ని తగ్గించటానికి అధిక పన్నులేస్తున్నామని చెబుతున్నారు. ఈ లాజిక్ ఏంటో ఇప్పటికీ అర్ధం కాదు.
ఇక బీడీల విషయాన్ని కొస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి అధిక కాదుకదా అసలు పన్నే ఎత్తేయమని అడుగుతున్నారు. వాస్తవానికి బీడీల్లో సిగరెట్టుకన్నా ఎక్కువ నికోటిన్ ఉంటుంది. ఇవ్వాళ దేశంలో పొగ తాగే వాళ్లలో 80 శాతం మంది బీడీలు కాల్చేవాళ్లే. మరి లక్షలమంది బీడీకార్మికుల జీవితాలకు అదే లక్షలమంది జీవితాలు బలైనా ఫర్వాలేదా? బీడీ కార్మికులు ఓ క్రమపద్ధతిలో గుర్తించబడతారు. అదే బీడీ కాల్చి చనిపోయే వాళ్ళు ఒక్కచోట, ఒక టైం లో గుర్తించబడరు కదా. పొగాకు పీల్చటం, తినటం మహమ్మారి అయినప్పుడు బీడీ తాగటం మహమ్మారి కాదా? ఈ తర్కం ఎక్కడికి దారి తీస్తుంది? ఎన్ని లక్షలమంది పేద వాళ్ళ ప్రాణాలు ( ఎందుకంటే బీడీ తాగేవాళ్ళు పేదవాళ్ళే కాబట్టి) బలి తీసుకుంటుంది. ఇది రాజకీయనాయకులకు పట్టదా? కాబట్టి హరీష్ రావు గారూ, దయచేసి బీడీలపై పన్ను తీసేసి లక్షల మంది పేదవాళ్ల ప్రాణాలు బలి తీయకండి. చేతనయితే బీడీ ఆకు సేకరణను నిషేదించమని అడగండి. మీ రాష్టం వరకు ఆ పని మీరే చేయొచ్చు. బీడీల కొక నీతి, సిగరెట్ల కొక నీతినా ? ఇటువంటి జనాకర్షణ చర్యలతో పేదవాళ్ల బతుకులతో ఆడుకోకండి. ఇంకా చేతనయితే బీడీల పరిశ్రమపై ఆధారపడిన వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే పథకాలకు రూపకల్పన చేయండి. ప్రజలు, బీడీ కార్మికులు హర్షిస్తారు. అప్పటివరకు పన్ను ని ఉండనీయండి. ఎటువంటి పరిస్థితుల్లో పన్ను తీసివేయొద్దు. దీనిపై ప్రజా ఉద్యమం రావాలి. అన్ని రాజకీయపార్టీలు ఇందుకు వ్యతిరేకమని తెలుసు. సంఘ సేవకులు, యెన్ జి ఓలు కదలాల్సిన అవసరం ఎంతయినా వుంది.