Homeఆంధ్రప్రదేశ్‌YS Sunitha Reddy: పట్టువదలని సునీత.. తండ్రి వివేకా కోసం ఎంతదాకైనా..!

YS Sunitha Reddy: పట్టువదలని సునీత.. తండ్రి వివేకా కోసం ఎంతదాకైనా..!

YS Sunitha Reddy
YS Sunitha Reddy

YS Sunitha Reddy: వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌.భాస్కరరెడ్డి అరెస్ట్‌ వరకు దారితీసిన పరిణామాల వెనుక.. వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి అలుపెరగని పోరాటం ఉంది. తన తండ్రిని హత్య చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా.. శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో కోర్టు లోపలా, వెలుపలా ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యం. వైద్యవృత్తిలో ఉన్న ఒక సాధారణ మహిళ.. అనేక ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఒంటరి పోరాటం చేశారు. ఆమె సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించి, కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.

ప్రభుత్వం తీరుతో నిరాశ..
వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం నీరుగార్చాలని చూడడం, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ ప్రతిపక్ష నేతగా హైకోర్టులో పిటిషన్‌ వేసిన జగన్‌.. తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయించాలని కోరినప్పుడు.. జగన్‌ నుంచి తగిన స్పందన లేకపోవడం, ఆ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్నవారిని సమర్థించేలా మాట్లాడడం వంటి పరిణామాలు నిరాశపరిచాయి.

ప్రభుత్వంతో న్యాయం జరుగదని..
జగన్‌ ప్రభుత్వ హయాంలో తనకు న్యాయం జరగదని, తండ్రి మరణానికి కారకులైనవారికి శిక్ష పడదని భావించిన ఆమె.. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి అమె తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. ‘నీతోపాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాల్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు’ అంటూ కొందరు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నాలూ చేశారు. ఈ విషయాలన్నీ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతే స్వయంగా చెప్పారు. ‘వివేకా హత్య కేసులో నీ భర్తను కూడా అనుమానితుడిగా భావించాలి’.. అని ముఖ్యమంత్రి జగన్‌ తనతో పలుమార్లు అన్నట్లు కూడా ఆమె సీబీఐకి చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటం వల్లే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా దర్యాప్తు అంత వేగంగా ముందుకు సాగలేదు. ఆమె అటు ఢిల్లీ స్థాయిలోనూ తీవ్రంగా ప్రయత్నించారు.

నీరుగారుస్తున్నారని గుర్తించి..
వివేకా హత్య కేసుపై దర్యాప్తునకు అప్పటి టీడీపీ పభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసి కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి నేతృత్వంలో మరో సిట్‌ ఏర్పాటు చేసింది. దర్యాప్తు కొంత వేగం పుంజుకున్న దశలో.. ఎదురైన ఒత్తిళ్లు తట్టుకోలేక అభిషేక్‌ మహంతి సెలవుపై వెళ్లిపోయారు. ఎస్పీగా అన్బురాజన్‌ను నియమించారు. సునీత ఆయనను కలవగా.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి మార్గనిర్దేశమూ లేదని ఆయన తేల్చేశారు. పైగా కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించబోతున్నారన్న ప్రచారమూ జరిగింది. ఆ పరిణామాలతో కంగుతిన్న సునీత.. సీబీఐ దర్యాప్తు కోసం కోర్టును ఆశ్రయించక తప్పదని నిర్ణయించుకున్నారు. ‘కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులను మార్చడం. కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం వంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో అమాయకులను బలిచేసి అసలు నేరస్థులను వదిలేస్తారేమోన్న సందేహం కలుగుతోంది’ అని ఆమె కోర్టుకు నివేదించారు. ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి సహా 15 మందిని అనుమానితులుగా ఆమె కోర్టుకు నివేదించారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష నేతగా వ్యాజ్యం దాఖలు చేసిన జగన్‌ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు కోరలేదని ఆమె పేర్కొన్నారు.

జగన్‌ నుంచి సహాయ నిరాకరణ?
వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా ఆయన నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని సునీత వివిధ సందర్భాల్లో వెల్లడించిన విషయాల్ని బట్టి అర్థమవుతోంది. ‘నా తండ్రి హత్య కేసు విషయమై చర్చించేందుకు జగన్‌కు చెప్పి ఫ్యామిలీ మీటింగ్‌ ఏర్పాటు చేయించాలని విజయమ్మను కోరాను. ఆమె జగన్‌కు ఫోన్‌ చేసి ఆ విషయం చెబితే… ఆయన నవ్వి, గంట కూడా సమయం కేటాయించలేనని చెప్పారు. ఆ తర్వాత 2019 అక్టోబరు 6న తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో భేటీ ఖరారైంది. అనుమానితుల పేర్ల జాబితాను జగన్, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందజేశాను. అందులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుకు బదులు.. నా∙భర్త ఎంవీ కృష్ణారెడ్డి పేరును చేర్చాలని సలహా ఇచ్చారు. ఆయనతో నేను వాదించాను. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతారని, అప్పుడు ఆయనకు ఏమీ కాదని జగన్‌ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు సీబీఐకి వెళితే తనకు(జగన్‌కు) 12వ కేసు అవుతుందని అన్నారు’ అని గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. ‘వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి(భారతి చిన్నాన్న కుమారుడు) తనకు కళ్లలాంటివారని జగన్‌ చెప్పినట్టు.. అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాతో అన్నారు’ అని కూడా సునీత పేర్కొన్నారు.

YS Sunitha Reddy
YS Sunitha Reddy

తండ్రి కోసం ఎందాకైనా..
వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించినా.. దర్యాప్తు అంత సాఫీగా సాగలేదు. ఆ దశలో ఆమె ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను అనేకసార్లు కలసి.. జరుగుతున్న పరిణామాల్ని వివరించారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ చేసిన వారికి బెయిల్‌ ఇవ్వవద్దని సీబీఐ వేసిన పిటిషన్లలో ఆమె కూడా ఇంప్లీడ్‌ అయ్యారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా విచారణలో ఎలాంటి పురోగతి లేదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షించాలని.. దర్యాప్తు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దాంతో కేసును తెలంగాణకు మార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular