Chikoti Praveen : ‘చీకోటి ప్రవీణ్’.. ఇప్పుడు ఈ క్యాసినో కింగ్ పై తుపాకీ పెట్టి తెలంగాణలో తమకు ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ ను కాల్చాలని బీజేపీ చూసింది. కేంద్రంలోని ఈడీతో చీకోటి చీకటి సామ్రాజ్యంపై దండెత్తి అతడి దందాను అంతా బయటపెట్టింది.అయితే టీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని బీజేపీ వేసిన ఈ వలలో అనవసరంగా వైసీపీ చిక్కుకుంది. వైసీపీని అసలు ఇందులోకి లాగాలని బీజేపీ అనుకోకున్నా.. చీకోటి దందాలో టీఆర్ఎస్ నేతల కంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రే ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ ఇరుకునపడినట్టైంది.

అయితే చీకోటి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా పవర్ ఫుల్. ఆయన చేతుల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు చీకోటి అరెస్ట్ తో అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు రేగుతోంది. చీకోటి ప్రవీణ్ దందాలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుసుకున్న బీజేపీ వెంటనే తమ చెప్పుచేతుల్లో ఉన్న ఈడీతో దాడులు చేయించినట్టు ప్రచారం సాగుతోంది. . చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో గులాబీ నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలంగాణ మంత్రులు తలసాని, మల్లారెడ్డి. ఐదారుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అతడితోపాటు పలువురు నేతలు హవాలా దందాలో భాగస్వామ్యం అయినట్లు చర్చ సాగుతోంది. ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు పేరు కూడా తెరపైకి వచ్చింది.
చీకోటి ప్రవీణ్ ను కదిలించిన ఈడీకి అతడితో సంబంధమున్న ఏపీ అధికార పార్టీ నేతల లింకులు బయటపడినట్టు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితోపాటు మంత్రులు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్టు సమాచారం. వీరికి క్యాసినోతో లింకులు ఉండడంతో ఇప్పుడు టీఆర్ఎస్ కోసం తవ్వితే అనవసరంగా వైసీపీ బుక్ అయినట్టుగా చెబుతున్నారు.
ఇప్పటికే ఈ ప్రచారం సాగడంతో మాజీ మంత్రి బాలినేని బయటకు వచ్చారు. తాను క్యాసినో, పేకాట ఆడుతానని.. కానీ చీకోటి ప్రవీణ్ తో తనకు సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అడగకముందే ఆయన అలా అనడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా మారింది.
ఇప్పుడు టీఆర్ఎస్ నేతల కంటే కూడా ఈ ఉచ్చు ఏపీ నేతలకు బలంగా తాకుతోంది. టీఆర్ఎస్ ను బుక్ చేద్దామని బీజేపీ ఈడీని ప్రయోగిస్తే ఏపీ నేతలు ఇందులో అడ్డంగా దొరికిపోతున్న పరిస్థితి నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ సన్నిహితంగానే ఉంటుంది. ఆ పార్టీకి అన్ని విధాల మద్దతు ఇస్తోంది. అయితే ఇప్పుడు ఈ చీకోటి వ్యవహారంలో కేంద్రం వైసీపీ నేతలను సైడ్ చేస్తుందా? కాపాడుతుందా? కేవలం టీఆర్ఎస్ వారినే టార్గెట్ చేస్తుందా? అన్నది వేచిచూడాలి.