WPL 2024: రేపు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు

మరో మూడు బంతులు మిగిలి ఉన్నయనగా ఛేదించింది. అయితే ఈసారి ముంబై జట్టు ఎలిమినేటర్ స్టేజిలోనే ఇంటిదారి పట్టడంతో అనూహ్యంగా బెంగళూరు ఫైనల్ వరకు వచ్చింది. మరి ఢిల్లీ ఈసారైనా కప్ దక్కించుకుంటుందా? లేక బెంగళూరు అద్భుతం చేస్తుందా? మరికొద్ది గంటల్లో తేలనుంది.

Written By: NARESH, Updated On : March 16, 2024 10:06 pm
Follow us on

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ తుది దశకు చేరుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై పై బెంగళూరు విజయం సాధించడంతో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న ఢిల్లీ జట్టుతో బెంగళూరు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది ట్రోఫీ దక్కించుకున్న ముంబై జట్టు ఈసారి ఎలిమినేటర్ రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఢిల్లీలో అరుణ్ జైట్లీ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కుతుబ్ మినార్ పై అందమైన లైటింగ్ ఏర్పాటు చేసింది. దానిపై బెంగళూరు, ఢిల్లీ జట్ల కెప్టెన్ల ఫోటోలు, ఐపీఎల్ ట్రోఫీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య ఫైనల్ పోరు నేపథ్యంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక సుదీర్ఘ ప్రకటన చేశారు. దీనిని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో జై షా ఏమన్నారంటే..” ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఇప్పటివరకు విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పటివరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను 3,50,000 అభిమానులు నేరుగా వచ్చి తిలకించారు. వారి ప్రోత్సాహం వల్లనే ఈ లీగ్ ఇంతలా విజయవంతమైంది. రేపు ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ను ఇదే స్థాయిలో విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని” జై షా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని బిసిసిఐ భావించలేదు. కానీ రెండవ సీజన్లో ప్రేక్షకులు మహిళల ఆట తీరును చూసేందుకు నేరుగా మైదానాలకు వచ్చారు. కేవలం ఐదు జట్లు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు మూడు లక్షల 50 వేల మంది మ్యాచ్ లను తిలకించారంటే క్రికెట్ పై వారికున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు.

ఇక ఫైనల్ కు బెంగళూరు, ఢిల్లీ జట్లు దూసుకెళ్లిన నేపథ్యంలో.. టైటిల్ ఎవరి దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ప్రారంభ సీజన్లో ఢిల్లీ, ముంబై జట్లు ఫైనల్ చేరుకున్నాయి. ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 131 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యం స్వల్పమైనప్పటికీ ముంబై జట్టు చివరి వరకు ఆడి.. మరో మూడు బంతులు మిగిలి ఉన్నయనగా ఛేదించింది. అయితే ఈసారి ముంబై జట్టు ఎలిమినేటర్ స్టేజిలోనే ఇంటిదారి పట్టడంతో అనూహ్యంగా బెంగళూరు ఫైనల్ వరకు వచ్చింది. మరి ఢిల్లీ ఈసారైనా కప్ దక్కించుకుంటుందా? లేక బెంగళూరు అద్భుతం చేస్తుందా? మరికొద్ది గంటల్లో తేలనుంది.