World Food Day: ప్రపంచ ఆహార దినోత్సవం 2023.. టన్నుల కొద్దీ వృథా అవుతున్న ఆహారం!

ఎఫ్‌ఏవో గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది.

Written By: Raj Shekar, Updated On : October 17, 2023 11:19 am

World Food Day

Follow us on

World Food Day: లేనివాడికి తిండే దొరకదు.. ఉన్నవాడికి తిన్నా అరగదు.. అని 70వ దశకంలోనే ఓ సినీకవి రాశాడు. కానీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారత దేశంలో ఇంకా ఆకలి చావులు కొనసాగుతన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. సరైన తిండిలేక వేల మంది వ్యాధులబారిన పడుతున్నారు. సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతీవ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం.

1979లో ఎఫ్‌ఏవో సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవు దినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్‌ ఫుడ్‌ డే ధీమ్‌ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం… ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోందో తెలుసుకుందాం.

130 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తులు వృథా..
ఎఫ్‌ఏవో గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. కోవిడ్‌–19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్‌ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు.

ఇవి మీకు తెలుసా…
– ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ డేను ఆచరిస్తున్నాం.

– ప్రపంచంలో ప్రతీ పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా… ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్తోమత లేదు.

– ఇజ్రాయెల్‌ – పాలస్తీనా, రష్యా–ఉక్రెయిన్‌ మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది.

– ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆకలి చావులు ఆఫ్రికా దేశాల్లోనే జరుగుతున్నాయి.

– పాలనా వైఫల్యాలు కూడా ఆహారం దొరకకపోవడానికి కారణం. ఇందుకు తాజాగా శ్రీలంక, పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ.