Workload for women : అతివలు అవనిలో సగం.. ఆకాశంలో సగం అని అంటుంటారు. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉందంటారు.. ఈ సృష్టికి మూలం ఆది పరాశక్తి అంటారు.. ఇప్పుడు కష్టాల్లోనూ పురుషుల కంటే మహిళలే ముందున్నారు..! కొన్ని రంగాల్లో పురుషులతో స్త్రీలు సమానంగా రాణిస్తున్నారు. కానీ ఉన్నత చదువులు చదివి, తమ జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతామనుకున్న వారికి వివాహ బంధంతో సంకెళ్లు పడుతున్నాయి. ఫలితంగా వారి ఆశలు ఆవిరైపోతున్నాయి..కలలు కరిగిపోతున్నాయి. రోజంతా కుటుంబ వ్యవహారాలు చూసుకునేసరికే సమయం గడిచిపోతుంది. ఇటీవలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మహిళలు కార్యాలయాల్లో పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహించడం వల్ల వారికి అధిక శ్రమ అవుతోంది. ఫలితంగా వారికి నిద్ర కరువవుతోంది. ఉద్యోగం చేసే పురుషుల కన్నా ఉద్యోగంతో పాటు ఇంటిపనులు చక్కబెట్టే మహిళలు తీవ్రంగా శ్రమ పడుతున్నారని తెలుస్తోంది.

భారతదేశంలో ప్రతి ఐదుగురు పెళ్లైన యువతుల్లో ఒకరు మాత్రమే జీతంతో కూడిన పనిచేస్తున్నారు. మిగతావారంతా కుటుంబ సంరక్షణలోనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివి, వివిధ రంగాల్లో రాణించాలన్న ఆసక్తి ఉన్నా వివాహ బంధంతో వారి ఆశలకు సంకెళ్లు పడుతున్నాయి. ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూడాలి.. మరోవైపు వేతనం వచ్చే చోట పనిచేయాలి. ఇలా రెండు పనుల్లో తేడా రాకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి విశ్రాంతి కరువవుతోంది.
భారతదేశవ్యాప్తంగా 2019-2020 సంవత్సరంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన జాతీయ ప్రాతినిధ్య సర్వే ప్రకారం.. 20 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు ఇంటి పనిలో లేదా ఉద్యోగంలో ఉన్నట్లు తేలింది. అయితే ఈ సమయంలోనే మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం చేయాలన్న తపన ఇప్పుడే ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సి వస్తోంది. మరికొందరు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వివిధ రంగాల్లో రాణించేందుకు వారు అర్హులైనా కొన్ని పరిస్థితుల కారణంగా తన కలల్ని చంపేస్తున్నారు.
ఇంటిపనిలో నిమగ్నమైన మహిళలు రోజులో 8 గంటల పాటు పిల్లలు, వృద్ధుల సంరక్షణలో గడుపుతారు. అయితే ఒక్కోసారి ఇది ఎక్కువే పట్టవచ్చు. ఇక ఉద్యోగం చేసే మహిళలు రోజూవారీ 9.5 గంటలు కేటాయిస్తారు. అయితే వీరు సగటున పని కోసం కేటాయించేది 5 గంటల 15 నిమిషాలు మాత్రమే . మిగతా 4 గంటలు ఇంటిపనులు చేస్తారు. మొత్తంగా 9.5 గంటలు పనిలో నిమగ్నమవుతారు. ఇంట్లో ఉండే మహిళల కంటే ఉద్యోగం చేసే మహిళలకు అదనపు పనిభారం కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇంటిపనుల్లో పురుషులు అస్సలు సహకరించడం లేదని తేలింది. కొత్త జంటలు పనులు పంచుకోవడం లేదు.. ఈ కారణంగా మహిళలకు ఎక్కువ పని అయ్యి.. వారిని నిద్ర కరువవుతోంది.
అంటే మొత్తంగా వివాహం చేసుకున్న, ఉద్యోగం చేసే మహిళలు సరాసరి 10 గంటలు శ్రమిస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా కుటుంబ బాధ్యతలు లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలు ఉద్యోగం చేసినట్లయితే దాదాపు 6 గంటల 40 నిమిషాలు కార్యాలయాల్లో.. 1.5 గంటలు ఇంటిపని కోసం కేటాయిస్తారు. అదే పిల్లల సంరక్షణ బాధ్యతలు ఉన్నవారు మాత్రం 5 గంటల 20 నిమిషాలు ఇంటికోసం కేటాయిస్తారు. మొత్తంగా పెళ్లికాని యువతుల కంటే వివాహం అయి కుటుంబ బాధ్యతలు ఉన్న మహిళలు ఎక్కువగా శ్రమపడుతున్నారు. యువ వివాహితులకు రెండు పనుల కారణంగా విశ్రాంతి కరువవుతోంది. నిద్రాభారం అధికమవుతోంది.
[…] […]