Homeజాతీయ వార్తలుMunugode Bypoll: రాజగోపాల్‌రెడ్డి బలమెంత.. కాంగ్రెస్‌ బలహీనత ఎంత! మునుగోడులో గెలుపెవరిది?

Munugode Bypoll: రాజగోపాల్‌రెడ్డి బలమెంత.. కాంగ్రెస్‌ బలహీనత ఎంత! మునుగోడులో గెలుపెవరిది?

Munugode Bypoll: మునుగోడు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం చర్చలో ఉంటున్న నియోజవర్గం. నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన పదవికి ఇటీవల రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని కూడా వీడి బీజేపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 4 లేదా 5 నెలల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే రాజీనామా చేసి పది రోజులు కూడా కాకముందే మూడు ప్రధాన పార్టీలు, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీటు కావడంతో ఆపార్టీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక ఈ ఎన్నికల్లో ఓడితే దాని ప్రభావం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టీఆర్‌ఎస్‌ ఆవిస్తోంది.. ఇక మునుగోడు గెలిచి తర్వాత అధికారంలోకి వచ్చేది తామే అని నిరూపించుకోవాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది. దీంతో మూడు పార్టీలు కదన రంగంలోకి దిగాయి.

Munugode Bypoll
Munugode Bypoll

-కాంగ్రెస్‌కు చావోరేవో..
ఇటు తెలంగాణలో, అటు దేశంలో బలహీనపడుతూ వస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల చావో రేవో అనే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్‌ స్థానం కావడం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. అయితే నల్లగొండ కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఈ అనుకూల వర్గం కచ్చితంగా రాజగోపాల్‌రెడ్డి వెంట వెళ్తుంది. ఇక వ్యతిరేక వర్గం ఎటువైపు అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ వైపు రాజగోపాల్‌రెడ్డి వ్యతిరేకవర్గం మళ్లుతుందా.. లేక కాంగ్రెస్‌ అభ్యర్థిని బలపరుస్తుందా అనేదానిపైనే కాంగ్రెస్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దీనిని గమనించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. తాను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని విజయపథంలో నడిపించాలని భావిస్తున్నారు.

Also Read: Indian Temples Unique Prasads: భారతదేశంలోని ఈ దేవాలయాల్లో నైవేద్యంగా మాంసాహారం.. వింత ఆచారాలు

అంతర్గత కలహాలు..
అయితే కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్‌ను పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు, చెరుకు సుధాకర్‌తోపాటు మరో ఐదారుగురు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట ప్రకటన తర్వాత అంతర్గత కలహాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిని చల్లార్చడం టీపీసీసీ అధ్యక్షుడికి సవాలే.

-టీఆర్‌ఎస్‌లో టెన్షన్‌..
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో అనివార్యంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ఆ పార్టీని టెన్షన్‌ పెడుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో ఇప్పుడు మునుగోడులో ఓడితే దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పడుతుందని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌లా కాకుండా మునుగోడను గెలిచేందుకు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నారు.

-గులాబీలోనూ అసమ్మతి ముల్లు..
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి రగులుతోంది. దీని ప్రభావం ఉప ఎన్నికల్లో పడే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ అసమ్మతి అంతా రాజగోపాల్‌ సృష్టే అని స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరని టీఆర్‌ఎస్‌ నేతలే జెబుతున్నారు. గత ఎన్నిల్లో ఓడిన అభ్యర్థికి టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని చెబుతున్నారు. తాజాగా కేసీఆర్ సభ నిర్వహించి అసమ్మతి చల్లార్చాలని నిర్ణయించారు. ఈ సభతో అసమ్మతి సద్దుమనుగుతుందా లేక ఇంకా పెరుగుతుందా.. అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారు అనే అంశాలపై టీఆర్‌ఎస్‌ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి వ్యతిరేక వర్గాన్ని టీఆర్‌ఎస్‌లోకి లాగాలని స్థానిక నేతల ప్రయత్నిస్తున్నారు.

Munugode Bypoll
Munugode Bypoll

బీజేపీ దూకుడు..
భారతీయ జనతాపార్టీ తెలంగాణలో దూకుడు పెంచుతోంది. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. వైఫల్యాలను ఎండగడుతోంది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నియోజకవర్గానికి తీసుకు వస్తున్నారు. షా సభ తర్వాత పార్టీలో జోష్‌ పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. క్యాడర్‌ కూడా అంతంత మాత్రమే. కానీ మునుగోడు గెలుస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. హుజూరాబాద్‌ లాగానే మునుగోడు గెలుపుతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో మరో ‘ఆర్‌’ చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీకి మునుగోడు గెలుపు అనివార్యం. ఇది గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్‌గా భావించాలని చూస్తోంది. బలహీనంగా ఉన్న నల్లగొండ జిల్లాలో గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి నేతలను బీజేపీలోకి తీసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే బలంగా కనిపిస్తోంది.

-పోల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రభావం..
ఇక పార్టీలో చేరికలు, అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చివరికి ఎన్నికల ఫలితాలను పోల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు ముందుండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ కాస్త వెనుకబడే అవకాశమే కనిపిస్తోంది. ఇక్కడ పోల్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ప్రలోభాలు, ప్రభావితాలు, డబ్బుల పంపిణీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం.. తదితరాలు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పోల్‌మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగానే వచ్చాయి. ఇక్కడ ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు ప్రజలను ప్రభావితం చేసింది. కానీ మునుగోడులో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది.? దీని వలన ఎవరికి లాభం అని ఓటర్లు అలోచిస్తారని పేర్కొంటున్నారు. అయితే రాజగోపాల్‌ చెప్పినట్లు ఆయన రాజీనామాతో ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఇది ప్రభుత్వానికి లాభిస్తుందనుకుంటే రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లే జరుగుతుండడం గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి వెళితే.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేదన్న భావన బీజేపీలోనూ ఉంది. మొత్తంగా అన్ని పార్టీలకు మునుగోడు విజయం ఇప్పుడు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలిచే పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ విజయం బూస్టర్‌గా మారుతుంది అనేది మాత్రం వాస్తవం.

Also Read:Jagan- Govt Employees: ఏపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెడీ అయిన ఉద్యోగులు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular