Visakhapatnam: సాగర నగరం విశాఖలో వరుస హత్యలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు హత్యకు గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది. మూడు హత్యలు ఒకే మాదిరిగా ఉండడంతో సిరియల్ కిల్లర్ గా పోలీసులు భావిస్తున్నారు. ఉన్మాది చర్యగా అభిప్రాయపడుతున్నారు. అయితే ముగ్గురు హతులు అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ కుటుంబసభ్యులే కావడం గమనార్హం. దీంతో దీనిని ఒక సవాల్ గా తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే అనుమానితుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద మరణాయుధాలు లభ్యం కావడంతో నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్న ముషిడివాడ ప్రాంతంలో 47 సంవత్సరాల మహిళ దారుణ హత్యకు గురైంది.నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్లో నిద్రిస్తున్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు.పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతా నగర్ లో హత్య జరిగింది.మృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ, దేముడుబాబు దంపతులు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. వీరు నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ వాచ్ మెన్లుగా ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మీ దారుణ హత్యకు గురైంది. కేసు నమోదుచేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వృద్ధ దంపతుల హత్య..
వారం రోజుల కిందట ఇదే తరహాలో..ఇదే ప్రాంతంలో వృద్ధ దంపతులను దారుణంగా హత్యచేశారు. ఓ అపార్ట్ మెంట్లో వాచ్ మెన్లుగా ఉన్న అప్పారావు (55), లక్ష్మీ (50)లను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న వారిని అపార్ట్ మెంట్ నివాసితులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. మృతులది విజయనగరం జిల్లా. అయితే వారం రోజుల వ్యవధిలో అదే తరహాలో హత్య జరగడం విస్తు గొల్పుతోంది. సీరియల్ కిల్లర్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిందితులెవరనేది ఒకటి రెండు రోజుల్లో తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తారసపడ్డాడు. తనిఖీ చేయగా ఆయన వద్ద మరణాయుధాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఉలిక్కిపడిన విశాఖ
విశాఖ నగరం.. ప్రశాంతతకు నెలవు. అన్నివర్గల వారికి ఇష్టమైన నగరంగా మారిపోయింది. పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటుంది. అటువంటి నగర ఖ్యాతిని ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు మసకబారుస్తున్నాయి. నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. నేర సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హత్యలు, దొంగతనాలు, భూ కబ్జాలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల మాటున అయిన వారినే దారుణంగా హత్య చేస్తున్నారు. ఇటీవల ఇటువంటి ఉదంతాలు సైతం వెలుగుచూశాయి. ఇక యువత సైతం పెడదారిన పడుతున్నారు. విద్యాసంస్థల మాటున నిషేధిత మాదక ద్రవ్యాలు సైతం విక్రయాలు జరుగుతున్నాయి. ఇటు యువత కూడా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో వందలాది మంది యువకులు బైకులతో రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు నగర భద్రత, నిఘాను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. పోలీసులను సైతం నివ్వెరపరుస్తున్నాయి. విశాఖ సముద్ర తీరం ఉన్న నగరంలో ఇటువంటి దుశ్చర్యలు మరింత శృతిమించే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు.
[…] […]