Greater Hyderabad : ‘గ్రేటర్’పై ఆపరేషన్ ‘హస్తం’ వర్కవుట్ అవుతుందా?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 25 ఎమ్మెల్యే సీట్లలో 14 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ కేవలం ఒక్కసీటు దక్కించుకుంది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌న బలహీనపర్చడంపై రేవంత్‌ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : January 29, 2024 11:55 am

Greater Hyderabad Municipal Elections

Follow us on

Greater Hyderabad : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఊరట దక్కింది ఏదైనా ఉంది అంటే అది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం ఒక్కస్థానంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్‌పై పట్టు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు గ్రేటర్‌పై ఫోకస్‌ పెట్టారు. సైలెంట్‌గా ఆపరేషన్‌ హస్తం షురూ చేసినట్లు కనిపిస్తోంది. బలమైన క్యాడర్‌ ఉన్న లీడర్లను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంను కలిసే గ్రేటర్‌ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

రాజధానిపై పట్టు కోసం..
కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్‌పై పట్టు ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో గుర్తింపు దక్కని బలమైన నేతలను కాంగ్రెస్‌ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌ను కలిశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణారెడ్డి బాటలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితోపాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందే ‘పట్నం’ ప్రయత్నం
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయం తెలుసుకుని ఆయనకు హుటాహుటిన మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు. తాజాగా మరోమారు ఆయన హస్తం నేతలతో టచ్‌లోకి వెళ్లారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ మహేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. ఆయన సీఎంను కలవడంపై భిన్నంగా స్పందించారు. వందల సార్లు కలుస్తానని చెప్పారు. తద్వారా తాను కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం అన్న సంకేతాలు ఇచ్చారు.

తాజాగా రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే..
ఇక తాజాగా రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. పక్షం క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. దాదాపు గంటపాటు చర్చించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా.. ఈ భేటీ వెనుక రాజకీయం ఉన్నది అన్నది సుస్పష్టం. త్వరలో గ్రేటర్‌ పరిధిలోని మరికొంతమంది ఎమ్మేల్యేలు కూడా రేవంత్‌రెడ్డికి కలుస్తారని తెలుస్తోంది.

నాడు ఉనికే లేని పార్టీకి నేడు పట్టు..
బీఆర్‌ఎస్‌ పార్టీకి గతంలో గ్రేటర్‌ పరిధిలో ఏనికే కష్టంగా మారింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు మూడు కార్పొరేటర్లు మాత్రమే గెలిచేవారు. ఈ పరిస్థితి 2001 నుంచి తెలంగాణ ఏర్పడి 2014లో అధికారంలోకి వచ్చే వరకూ కొనసాగింది. కానీ, 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గులాబీ నేతలు గ్రేటర్‌పై ఫోకస్‌ పెట్టి వివిధ పార్టీల నాయకులను చేర్చుకున్నారు. దీంతో ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మేయర్ పీఠం దక్కించుకుంది. 2020లోనూ కాస్త బలం తగ్గినా రెండోసారి గ్రేటర్‌ పీఠం కైవసం చేసుకుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 25 ఎమ్మెల్యే సీట్లలో 14 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ కేవలం ఒక్కసీటు దక్కించుకుంది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌న బలహీనపర్చడంపై రేవంత్‌ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.