Divorce case : భార్య అంటే అణుకువ.. భార్య అంటే సర్దుకుపోవడం.. భార్య అంటే భూదేవికి ఉండేంత ఓర్పు.. సహనం.. ఇదంతా 90వ దశకం వరకూ సినిమాల్లో చూపించారు. మన సినీ చరిత్ర మొదలైనప్పటి నుంచి కన్నీటి సంద్రాలు రాల్చే భార్యలనే చూస్తున్నాం.. కానీ కట్ చేస్తే..

ఈ ఆధునిక యుగంలో ఉగ్రరూపంతో ఊగిపోయే మహిళలే మనకు కనిపిస్తున్నారు. సీరియల్స్ లో అయితే లేడి విలన్లతో నింపేస్తున్నారు. సినిమాల్లోనూ ఆ కర్కశ మహిళలే.. ఇప్పుడు ఆడవాళ్ల పగ ప్రతీకారాలు లేవంటే ఆ సీరియల్ అట్టర్ ప్లాప్ అయినట్టే. మునుపటిలా ఏడ్చే ఆడవాళ్లు లేరు.. ఏడిపించే వారే ఎక్కువగా ఉన్నారు.
ఏడ్చే మగాడిని నమ్మొద్దు అంటారు.. కానీ ఏడిపించే ఆడవాళ్లు ఉన్న ఈ దేశంలో ఏడ్చే మగాళ్లకు కొదవలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు గృహ హింస అంటే ఇంట్లోని మహిళను మొగుడు వేధించేవారు. కొందరైతే ‘రాఖీ’ సినిమాలో లాగా అతివల ప్రాణాలు తీసేవారు. కానీ స్వేచ్ఛ స్వాతంత్రాల ఈ ఆధునిక నవ కాలంలో మగాళ్లే బాధితులుగా మారుతున్నారు. చాలా మంది పురుష పుంగవులకు ఇంట్లో స్వాతంత్ర్యం లేదంటూ రోడ్డెక్కుతున్నారు. దేశంలో ‘భార్య బాధిత సంఘాలు కూడా వెలిశాయంటే అతిశయోక్తి కాదేమో..
నాగబాబు నుంచి కంటెస్టెంట్ల వరకూ.. అందరూ జబర్ధస్త్ లో భార్యా బాధితులం అని స్కిట్లు చేసి నవ్వించారు. వాళ్ల ఇళ్లల్లో అలా ఉంది కాబట్టే అది పునరావృతం అవుతోంది. తాజాగా చత్తీస్ ఘడ్ హైకోర్టుకు ఓ విడాకుల కేసు వచ్చింది. ఇది విన్నాక ఆ భార్య బాధితుడి బాధ విని హైకోర్టు జడ్జీలు కూడా కరిగిపోయారు. సాటి మగాడికి ఆ క్రూర లేడి బారి నుంచి వెంటనే విడాకులు మంజూరు చేశారు.
32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఓ మహిళతో 2010లో వివాహమైంది. రెండు మూడేళ్లు బాగానే ఉన్నారు. అనంతరం భార్య మూడో కన్ను తెరిచింది. భర్తకు నరకం అంటే ఏంటో లైవ్ లో చూపిస్తోందట.. భర్తను తన తల్లిదండ్రులను కలుసుకోనివ్వడం లేదు. భర్త ప్రభుత్వాఫీసుకెళ్లి అందరు ఉద్యోగుల ముందే బండ బూతులు తిట్టడం చేస్తుండేది. భార్య టార్చర్ తట్టుకోలేక ఆ భర్త విడాకుల పిటీషన్ ను కోర్టులో వేశాడు. ఆ కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. కానీ పగ ఇంకా తగ్గలేదేమో కానీ.. ఆ భార్య హైకోర్టుకు ఎక్కింది. తన భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని.. అందుకే విడాకులు కోరుతున్నాడని లేని ఆరోపణ చేసింది.
అయితే భర్త తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని.. భార్య పెట్టే టార్చర్ ను.. ఆఫీసుకొచ్చి మరీ తిట్టిపోసిన వీడియోలను కోర్టు ముందు పెట్టాడు. అసభ్య పదజాలంతో పది మంది తిట్టినదానికి సాక్ష్యాలు చూపించాడు.
ఇదంతా విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఫీసుకెళ్లి తిట్టడం.. భర్త పరువు తీయడం.. తల్లిదండ్రులను కలుసుకోనివ్వకపోవడం.. అక్రమ సంబంధం అంటకట్టడం క్రూరత్వమేనని.. ఈ భార్య నుంచి భర్తకు వెంటనే విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా జడ్జీలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మగాడి కష్టం పగోడికి కూడా రావద్దని జడ్జీలు కూడా కరిగిపోయారంటే ఆ లేడి టార్చర్ ఏ స్తాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.