Hyderabad Tunnel Road: హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్.. ఆధునిక హైదరాబాద్ గురించి అడిగితే హైటెక్‌సిటీ, ఎత్తయిన భవనాలు, ట్రాఫిక్ కష్టాలు, ఫ్లై ఓవర్లు అని చెబుతారు. వర్షం కుసినప్పుడు అయితే నగరంలో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఈ క్రమంలో నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు చుటూ ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు సొరంగ మార్గం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసిన అధికారులు ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ అంతర్జాతీయస్థాయి టెండర్లు పిలిచారు. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా ఎల్1గా నిలిచిన ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్‌కు పనులు అప్పగిచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు.

అటకెక్కినట్లే అనుకున్నారు..
దాదాపు నాలుగు నెలలైనా ప్రాజెక్టుకు ముందడుగు పడలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని ఒక దశలో భావించారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీంతో తదుపరి కార్యాచరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్‌లు రెండు దశలుగా చేపట్టాలని ఆదేశించింది. తొలిదశలోని ఫీజిబిలిటీ స్టడీ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతినిచ్చాకే డీపీఆర్ తయారీ చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టుకయ్యే వ్యయం, ప్రజలకు కలిగే సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫీజిబిలిటీ స్టడీ నివేదికను ఆరు నెలల్లో అందించాల్సి ఉంది. అనంతరం డీపీఆర్ కోసం మరో మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఫీజిబిలిటీ నివేదిక అందిస్తే సొరంగం తవ్వేందుకు సాధ్యాసాధ్యాలు.. అందుకయ్యే వ్యయం తదితర వివరాలు తెలుస్తాయి.
మేజర్ కారిడార్‌లో సాఫీ ప్రయాణం
ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి వయా కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్, అక్కడి నుంచి దుర్గం చెరువు వరకు ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే మేజర్ కారిడార్‌గా అధికారులు గుర్తించారు. ఈ కారిడార్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి సొరంగం మార్గం ఆలోచన చేశారు. రాష్ట్రంలో హైవేమార్గంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా సొరంగమార్గం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీబీఎం ద్వారా నిర్మాణం..
టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా దీన్ని నిర్మించనున్నారు. టన్నెల్ నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్, డిజైన్, అప్రోచ్ మార్గాలతోపాటు టెక్నికల్, ఎకనామికల్, సోషల్, ఫైనాన్సియల్ వయబిలిటీ, ట్రాఫిక్ తదితరమైనవి డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీ నివేదికలో వెల్లడిస్తారు. టన్నెల్‌లో క్యారేజ్‌వే ఎన్ని లేన్లలో ఉండాలో కూడా నివేదికలో సూచించనున్నారు. దేశంలో జమ్మూ కశ్మీర్‌లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ టన్నెల్ పొడవు 9.20 కి.మీ. ఇప్పటి వరకు అదే అత్యంత పొడవైనది. ముంబైలోనూ రోడ్ టన్నెల్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 6.3 కి.మీలు..
తొలి ప్రతిపాదనల మేరకు దాదాపు 10 కి.మీ మేర సొరంగమార్గం నిర్మించాలనుకున్నప్పటికీ, అనంతరం 6.30 కి.మీకు తగ్గించారు.
రోడ్ నంంబర్ 45 జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్∙వరకు 1.70 కి.మీ. రోడ్ నంబర్ 12 నుంచి టన్నెల్ జాయినింగ్ పాయింట్ వరకు 1.10 కి.మీలు. కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 2 కి.మీలు, మూడు అప్రోచెస్ 0.50 కి.మీ చొప్పున 1.5 కి.మీలు కలిపి మొత్తం 6.30 కి.మీలు నిర్మిస్తారు.
Also Read: Vikram Cobra First Review: విక్రమ్ ‘కోబ్రా’ మూవీ మొట్టమొదటి రివ్యూ ఎక్స్ క్లూసివ్ గా మీకోసం..