KCR Ambedkar: తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల కోసం ‘దళితబంధు’ ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా పేరుపొందారు. దళితులకు నిజంగానే బంధు అని పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ బయటకు చేసేది ఒకటి.. లోపల ఉన్నదొక్కటి అని ఇది వరకూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆయన చర్యలు కూడా దాన్ని బలపరిచేలా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది.

కేసీఆర్ ముందుగా దళితుడిని సీఎం చేస్తానని మాటతప్పారు. అనంతరం దళిత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి అవమానకరీతిలో సాగనంపారు. ఇక ఈసారి కేబినెట్ లో మాలకు మంత్రి పదవి ఇవ్వడం.. మాదిగలను కావాలనే పక్కనపెట్టారన్న ఆరోపణలు తెచ్చుకున్నారు.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ ఎప్పుడూ ఆయనకు నివాళులర్పించరు అన్న విమర్శ ప్రతిపక్షాలు నుంచి వస్తోంది. కేసీఆర్ ఎప్పుడు ఎందుకు ఇలా నివాళులర్పించరు అన్నది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. ఇప్పటిదాకా కేసీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎక్కడా పాల్గొన్నట్టుగా సమాచారం బయటకు రాలేదు. ఫొటోలు కూడా విడుదల కాలేదు. దీంతో ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా కనిపిస్తోంది.
కేసీఆర్ కు అంబేద్కర్ అంటే గౌరవం లేదని అందుకే రాజ్యాంగాన్ని మార్చేయాలని అంటున్నారని.. ఇటీవల వ్యాఖ్యలతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నివాళులర్పించకపోవడంతో మరింతగా విమర్శల వాన కురుస్తోంది.
అయితే అన్ని వైపులా విమర్శల నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్ అయినట్టున్నారు. బయట కార్యక్రమానికి హాజరు కాకుండా తన ఇంట్లోనే ప్రగతిభవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి మమ అనిపించారు. అందరూ అంబేద్కర్ జయంతిని బయట నేతలు, ప్రజల ముందు చేస్తే కేసీఆర్ మాత్రం తన నివాసంలోనే ముగించేసి విమర్శల డోసును కాస్త తగ్గించేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయాన్ని లేవనెత్తారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు నివాళులర్పించరని తాజాగా ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా నివాళులర్పించలేదని గుర్తు చేశారు.కాంగ్రెస్ నేతలు ఇదే మాట అంటున్నారు. అంబేద్కర్ ను కేవలం దళిత ఓటు బ్యాంకుగానే కేసీఆర్ చూస్తున్నారని.. అంతే తప్ప ఆయనపై కేసీఆర్ అభిమానం లేదని విమర్శిస్తున్నారు.
నిజానికి కేసీఆర్ ఇలా తన అభిమానాన్ని సందర్భాలను బట్టి చాటరు. అంబేద్కర్ కే కాదు.. తనతోపాటు ఉద్యమించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతులకు కూడా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. కానీ సమయం సందర్భంగా వచ్చినప్పుడు ఇలా ‘దళితబంధు’ అని.. ఇతర కార్యక్రమాల వేదికల వద్ద గుర్తు చేస్తూ తన కమిట్ మెంట్ ను చాటుకుంటున్నారు.
అయితే అందరూ ఇంతలా విమర్శిస్తున్నా ఎక్కడా ఆ విమర్శలు రాకుండా హైదరాబాద్ లో దేశంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహం.. స్మృతి వనాన్ని కేసీఆర్ నిర్మిస్తున్నారు. దీనికోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ పైకి అభిమానం చూపించరు కానీ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మాత్రం విమర్శించే వాళ్ల నోళ్లు మూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.