spot_img
Homeజాతీయ వార్తలుJoshimath: ప్రమాదంలో దేవభూమి : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పట్టణం జోషిమఠ్‌ ఎందుకు మునిగిపోతోంది? 

Joshimath: ప్రమాదంలో దేవభూమి : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పట్టణం జోషిమఠ్‌ ఎందుకు మునిగిపోతోంది? 

Joshimath: దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఉత్తరాఖండ్‌. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం.. ఎత్తయిన కొండలు.. పచ్చని అడవులు.. మంచు పర్వతాలు.. ఆహ్లాదమైన వాతావరణం ఉత్తరాఖండ్‌ సొంతం. దేశ విదేశాల పర్యాలకులను ఆకట్టుకోవడంతోపాటు ఆధ్యాత్మికంగానూ ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ దేవభూమి ఉప్పుడు ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. హిమాయలన్‌ టౌన్‌ జోషిమఠ్‌ కుంగిపోతోంది. ఇండ్లు, రోడ్లు ఎందుకు బీటలు వారుతున్నాయి. యాపిల్, ఇతర చెట్లు ఎందుకు నేలలో కూరుకుపోతున్నాయి. కరెంట్‌ స్తంభాలు విరుగుతున్నాయి. భూగర్భం నుంచి నీళ్లు ఉబికివస్తుతన్నాయి. ఇది ఇటు రాష్ట్రాన్ని కలవరపెడుతోంది.

Joshimath
Joshimath

కొండచరియపైనే ఊరు..
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో హిమాలయ పర్వతపాదాల వద్ద ఓ పెద్ద పర్వతానికి దిగువన ఉంది జోషిమఠ్‌. ఉత్తరాన అలక్‌నంద నది.. తూర్పున ధౌలి గంగ.. మధ్యన భారీ కొండచరియపైన ఉంది ఈ టౌన్‌. జోషిమఠ్‌ అడుగున ఉన్న నేల కొండచరియ కావడంవల్లే దీనిలోని మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశంలేదని చెప్తున్నారు.
భారం ఎక్కువై..
జోషిమర్‌ కుంగడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. పురాతన కాలంలో ఓ పెద్ద పర్వతం నుంచి జారిపోయిన పెద్ద కొండచరియపైనే ఈ టౌన్‌ ఉండటం ప్రధాన కారణమైతే.. గత కొన్ని దశాబ్దాలుగా రోడ్లు, ఇళ్లు, ప్రాజెక్టులు పెరగడంతో ఇక్కడి నేలపై మోయలేని భారం పడటం ఇంకో కారణమని చెప్తున్నారు. ఇక్కడ డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడం, వరదలతో నాలాలు పూడుకుపోవడంతో వాన నీళ్లు, ఇండ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయని.. ఫలితంగా ఏటవాలుగాఉన్న ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇంకిపోతూ లూజ్‌ మట్టి కరిగిపోయి నేల కుంగుతోందని అంటున్నారు.

అర్బనైజేషన్‌ కూడా ఓ కారణం..
కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందిన జోషిమఠ్‌ ఇప్పుడు చిన్న స్థాయి పట్టణంగా మారింది. అర్బనైజేషన్‌ కారణంగా బలహీనంగా ఉన్న నేలపై మోయలేని బరువు పడింది. మరోవైపు, నీళ్లు సహజంగా కిందకు వెళ్లిపోయేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఒక్కోచోట నీళ్లు కంట్రోల్‌ లేకుండా పెద్దమొత్తంలో ప్రవహించడంతో నేల కోతకు గురవుతోంది. 2013లో వరదలకు బురద పేరుకుపోయి ఇక్కడి నాలాలు బ్లాక్‌ అయ్యాయి. ఆ తర్వాత 2021లో మరోసారి వరదలు రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైందని
సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

1976లోనే ముప్పు తెలిసినా..
జోషిమఠ్‌కు ఉన్న ముప్పు గురించి 1976లోనే బయటపడింది. అప్పట్లో కూడా నేలపై నుంచే నీళ్లు పైకి ఉబికివచ్చాయి. కొన్ని చోట్ల నేల కుంగింది. దీనిపై ప్రభుత్వం నియమించిన మిశ్రా కమిటీ అధ్యయనం చేసింది. అర్బనైజేషన్‌ కారణంగా భవిష్యత్తులో టౌన్‌ కుంగిపోయే ప్రమాదం ఉందని కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. అయితే, అప్పట్లో ఆ కమిటీ రిపోర్ట్‌ను ప్రజలు తేలిగ్గా తీసిపారేశారు. ప్రభుత్వాలు కూడా పెద్దగా చర్యలు చేపట్టలేదు.

Joshimath
Joshimath

అప్రమత్తమైన ప్రభుత్వం.
నేల కుంగిపోతూ.. ఇళ్లకు బీటలు వారుతున్న జోషిమఠ్‌ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. జోషిమఠ్‌లోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని నిర్ధారించింది. నేలపై పగుళ్లు విస్తరిస్తున్నాయని, మరో కిలోమీటర్‌కు పైగా వీటి ప్రభావం ఉంటుందని వెల్లడించింది. 19 వేల జనాభా.. 4,500 ఇళ్లు, భవనాలు ఉన్న ఈ పట్టణంలో ఇప్పటి వరకు 610 ఇళ్లకు పగుళ్లు రాగా.. అత్యవసరంగా 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. జోషిమఠ్‌ పట్టణంలోని పలు హోటళ్లు, ఓ గురుద్వారా, రెండు కళాశాలల్లో వీరికి వసతి కల్పించారు. ప్రమాదకరంగా మారిన ఇళ్లకు రెడ్‌మార్క్‌ వేశారు. ఈ ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించారు. కాగా, ఈ విపత్తు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని జోషిమఠ్‌ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ధామికి ప్రధాని మోదీ ఫోన్‌..
జోషిమఠ్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జోషిమఠ్‌ ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

రంగంలోకి కేంద్రం..
జోషిమఠ్‌ పరిస్థితిపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాని ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో కేబినెట్‌ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా అధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ సభ్యులు ఈ సమీక్షలో వర్చువల్‌గా పాల్గొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కార్యదర్శి రంజిత్‌ సిన్హా నేతత్వంలోని ఎనిమిది మంది నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమీక్షలో చర్చించినట్లు తెలిసింది. దెబ్బతిన్న/బీటలు వారిన ఇళ్లను కూల్చివేయాలన్న కమిటీ నివేదికను ఆమోదించినట్లు సమాచారం. జోషిమఠ్‌లోని ఇతర నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా వెంటనే సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధ్యయనానికి కేంద్ర బృందం సోమవారం జోషిమఠ్‌ను సందర్శించనుంది.

భూమి లోపల పరిశోధన
జోషిమఠ్‌ నగరం కింద భూగర్భంలో డొల్లగా, భారీ సొరంగాలున్నాయని ఐఐటీ–రూర్కీ శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూమి కుంగిపోతుండడానికి ఇలాంటి సొరుగులు/సొరంగాలే కారణమని ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ బీకే.మహేశ్వరి చెబుతున్నారు. భూగర్భంలో జల ప్రవాహాల ద్వారా ఇలాంటి సొరుగులు ఏర్పడతాయన్నారు. వీటిని గుర్తించేందుకు ఐఐటీ శాస్త్రవేత్త డాక్టర్‌ అభయానంద్‌సింగ్‌ మౌర్య తయారు చేసిన ఎలక్ట్రికల్‌ రెసిడెన్సీ టెమోగ్రఫీ(ఈఆర్టీ) యంత్రాన్ని వినియోగిస్తామన్నారు. ఈ యంత్రం భూమిలోపల కొన్ని మీటర్ల లోతులో ఉండే పరిస్థితులను 3డీ రూపంలో చిత్రాలను తీయగలదని ఆయన వివరించారు.

సర్వేకు హైదరాబాద్‌ ఎన్‌ఆర్‌ఎస్సీ
జోషిమఠ్‌లో ఇతర ఆవాస ప్రాంతాలు సురక్షితమేనా అని సర్వే నిర్వహించడానికి హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్సీ)ని సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి కోరారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ అంశంపై ఓ నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌), జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఐఐటీ రూర్కీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ(రూర్కీ), సీఎస్‌ఐఆర్, సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లకు కూడా సర్వే బాధ్యతలను అప్పగించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular