
KCR – ABN RK : తెలంగాణలో కెసిఆర్ కు ప్రత్యామ్నాయంగా ఎవరు? ఆయనను ఓడించేంత సత్తా బిజెపి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉన్నాయి? రేవంత్, బండి సంజయ్ కు కెసిఆర్ ను ఓడించేంత సత్తా లేదు. ఇవీ కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసుకొచ్చిన పలుకులు. గత కొంతకాలంగా కేసీఆర్ పై ఉప్పు నిప్పులాగా ఉన్న రాధాకృష్ణ.. ఈసారి కొత్త పలుకులో స్టాండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కెసిఆర్ పై చాలా రోజుల తర్వాత పాజిటివ్ కోణంలో రాసుకొచ్చాడు. తెలంగాణ రాజకీయాలను కెసిఆర్ పాత్ర లేకుండా ప్రస్తావించలేమని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు.
ఎందుకు ఇలా?
మనం గతంలోనే చెప్పుకున్నాం కదా! కెసిఆర్, రాధాకృష్ణది తోటి కోడళ్ళ పంచాయితీ. ఎక్కువ రోజులు ఆ పంచాయతీ ఉండదు. ఉన్నన్ని రోజులు మాత్రం ఇద్దరి మధ్య వ్యవహారం చిటపటలాడుతూనే ఉంటుంది.. కెసిఆర్, రాధాకృష్ణ మధ్య కూడా అలానే ఉంది. కొద్ది రోజులు దూరం, మరి కొద్ది రోజులు దగ్గర. అప్పట్లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో కెసిఆర్ రాధాకృష్ణ ఛానల్ ఏబీఎన్ పై ప్రకటిత నిషేధం విధించాడు. తర్వాత కొద్ది రోజులకు ఇద్దరి మధ్య వివాదాలు గాయబ్. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఆయత చండీ యాగానికి రాధాకృష్ణను పిలిచాడు. స్వయంగా శాలువా కప్పి సన్మానించాడు. మళ్లీ కొద్ది రోజులు ఆంధ్రజ్యోతి పత్రికలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ప్రచురితం కాలేదు. జూబ్లీహిల్స్ లో ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాలిపోయినప్పుడు కేసీఆర్ ఉదారత చూపాడు. ఆర్కే తన దోస్త్ కాబట్టి బంజారాహిల్స్ ప్రాంతంలో ఖరీదైన భూమి ఇచ్చాడు.
అప్పుడు బేధాభిప్రాయాలు
2018 ఎన్నికల్లో ఆర్కే కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు వైపు స్టాండ్ తీసుకున్నాడు. స్వతహాగానే ఇది కేసీఆర్ కు నచ్చలేదు. నువ్వు నా ఫోల్డ్ లో ఉండాలి అన్నాడు. ఆర్కే కుదరదు అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య జగడం స్టార్ట్.. స్వతహాగానే ఇద్దరు కూడా అహంభావం నిండిన వ్యక్తులు కావడంతో ఎవరూ తగ్గలేదు. ఆ మధ్య లిక్కర్ స్కాంలో కవిత పేరు వినిపించడంతో రాధాకృష్ణ ఆమెను పిలిచాడు. ఇంటర్వ్యూ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కెసిఆర్ కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ లోగానే కెసిఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశాడు.. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేశాడు..ఈ సమయంలో రాధాకృష్ణతో పంచాయతీ ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ… మొత్తానికి సంధి మార్గం కుదుర్చుకున్నాడని టాక్ వినబడుతోంది. అందులో భాగంగానే రాధాకృష్ణ తన కొత్త పలుకులో కెసిఆర్ పాజిటివ్ స్టాండ్ తీసుకున్నాడు. అమిత్ షా ను మందలించాడు.. ఏమోయ్ అమిత్.. తెలంగాణలో కెసిఆర్ ప్రబల శక్తిగా ఉన్నాడు. అతడిని తట్టుకోవడం నీ వల్ల అవుతుందా అంటూ హెచ్చరికలు జారీ చేశాడు..ఇలా చాలానే చెప్పు కుంటూ పోయాడు గాని.. ఈ కథనం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కెసిఆర్, నాకు మధ్య కాల్పుల ఒప్పంద విరమణ జరిగిందని రాధాకృష్ణ చెప్పకనే చెబుతున్నాడు.