HomeజాతీయంMaoist Hidma : ఎవరు ఈ హిడ్మా? మావోయిస్టులో ఎందుకు ప్రత్యేకం?

Maoist Hidma : ఎవరు ఈ హిడ్మా? మావోయిస్టులో ఎందుకు ప్రత్యేకం?

Maoist Hidma : ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో 10 మంది పోలీసులు దుర్మరణం చెందారు. జమ్మూ కాశ్మీర్ లో ఫుంచ్ ఘటన మరచిపోక ముందే ఛత్తీస్ గడ్ లో 10 మంది పోలీసులు దుర్మరణం చెందారు. అయితే ఈ ఘటన వెనుక హిడ్మా ఉన్నాడని ప్రచారం జరుగుతున్నది. గతంలో పోలీసులు తమ కాల్పుల్లో హిడ్మా చనిపోయాడని ప్రకటించారు. కానీ అనూహ్యంగా హిడ్మా పేరు బుధవారం జరిగిన మందు పాతర పేలుడులో ప్రముఖంగా వినిపించింది. హిడ్మా పేరు కేవలం ఈ ఘటన లోనే కాదు… మావోయిస్టులు చేపట్టిన పలు విధ్వంసక కార్యక్రమాల్లో అతడు ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఈ హిడ్మా? మావోయిస్టుల్లో ఎందుకు కీలకంగా మారాడు? స్థానిక పోలీసుల నుంచి కేంద్ర బలగాల దాకా ఎందుకు అతడిని టార్గెట్ చేశాయి?

40 సంవత్సరాల వయసు, బక్క పలచని దేహం

హిడ్మా ను ఇంతవరకు ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేదు.. అయితే కొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన వివరాల ప్రకారం.. హిడ్మా కు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. బక్కపలచని దేహంతో చాలా మృదువుగా మాట్లాడుతాడు. అతడిని చూస్తే ఇతడేనా ఇంతటి విధ్వంసానికి పాల్పడింది అనిపిస్తుంది.. దాదాపు దశాబ్ద కాలంగా ఇతడు దండకారణ్యంలో ఉంటున్నాడు. మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసక కార్యక్రమాలకు ఇతడే రూపకల్పన చేశాడు. అనేకమంది పోలీసుల దుర్మరణాలకు కారణమయ్యాడు. దాదాపు పదికి పైగా దాడులకు కర్త, కర్మ, క్రియ గా వ్యవహరించిన హిడ్మా.. పదుల సంఖ్యలో భద్రత బలగాలను పొట్టన పెట్టుకున్నాడు. 1996_97 ప్రాంతంలో తన 17వ సంవత్సరంలో హిడ్మా మావోయిస్టు పార్టీలో చేరాడు..అతడికి మాడావి, హిద్మల్లు, సంతోష్ అనే మారు పేర్లు ఉన్నాయి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని పువర్తి ఇతడి గ్రామం. ఈ గ్రామం నుంచి దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని ఒక అంచనా. మావోయిస్టు ఉద్యమంలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు.

మృధు స్వభావి

హిడ్మా పెద్దగా ఎవరితో మాట్లాడడు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మాత్రం బాగా ఆసక్తి చూపిస్తాడు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఒక అధ్యాపకుడి ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకున్న అతడు చదువుకున్నది కేవలం ఏడవ తరగతి మాత్రమే. హిడ్మా ను 2000 సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు.. ఆయుధాల తయారీ తో పాటు, మరమ్మతులు కూడా చేసేవాడు. గ్రనేడ్లు, లాంచర్లు స్థానికంగా తయారు చేసేవాడు. 2001_2 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్ విభాగంలో ఎదిగాడు. తర్వాత మావోయిస్టు సాయుధ విభాగం (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) లో చేరాడు. 2001 నుంచి 2007 దాకా అతడు సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడు గానే ఉన్నాడు. కానీ సల్వాజుడుం ఎదుగుదల హిడ్మా ను మరింత యాక్టివ్ చేసింది. 1990 మధ్యలో ఒక దశలో బస్తర్ ప్రాంతంలో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ తిరిగి పుంజుకునేందుకు స్థానికుల్లో సల్వాజుడుం పై ఏర్పడిన ప్రతీకారమే ఒక కారణంగా తెలుస్తోంది.

వరుస దాడులు

2007 సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇది హిడ్మా నాయకత్వంలో జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించారు. సాధారణంగా మావోయిస్టులు మందు పాతరల మీద ఆధారపడతారు. కానీ తొలిసారిగా ఆ ప్రాంతంలో ఆయుధాలతో తలపడ్డారు. ఏకంగా 24 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను పట్టణ పెట్టుకున్నారు. అయితే మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మా పాత్ర పోషించాడు. అదే కాదు 2008_09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటుచేసిన ఫస్ట్ బెటాలియన్ కు కమాండర్ అయ్యాడు. ఈ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. 2011 దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యాడు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. వాస్తవంగా హిడ్మా నేరుగా తుపాకులు పేల్చేది చాలా తక్కువ. కానీ దగ్గరుండి మిగతా మావోయిస్టులను నడిపిస్తాడు. ఎంతో అవసరం అయితే తప్ప తన దగ్గర ఉన్న తుపాకీ ఉపయోగించడు. ఇప్పటివరకూ హిడ్మా కు ఒక గాయం కూడా కాలేదు. మావోయిస్టు దళంలో బాగా పేరు వచ్చి దూకుడుగా సాగే మావోయిస్టులు ఎక్కువ కాలం కొనసాగలేరు. వారు చనిపోవడమో లేదా లొంగిపోవటమో జరుగుతుంది. కానీ, హిడ్మా అలా కాదు. ఇప్పటికీ మావోయిస్టులకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నాడు. అనేక రకాలైన దాడుల్లో కీలకపాత్ర పోషిస్తూనే ఉన్నాడు. ఆ మధ్య పోలీసులు అతడిని చంపామని ప్రకటించారు. కానీ నేను బతికే ఉన్నానని హిడ్మా ఒక లేఖ ద్వారా ప్రకటించాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular