Bigg Boss 6 Telugu Top-5 : గడిచిన 5 సీజన్ల కంటే కూడా బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ చాలా చప్పగా సాగుతోంది. నాగార్జున అన్నట్టు కంటెస్టెంట్స్ అంతా హౌస్ లో చిల్ అవ్వడానికే వచ్చినట్టు కనిపిస్తోంది. మునుపు ఉన్నంత ఊపు.. కంటెస్టెంట్లలో పోరాడాలన్న కసి.. గేమ్ స్ట్రాటజీలు అస్సలు కనిపించడం లేదు. తినడం.. వాగడం.. పడుకోవడం తప్పితే పెద్దగా ఆసక్తికరంగా ఈ బిగ్ బాస్ ఉండడం లేదు.

అందుకే తొలి వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చిన హోస్ట్ నాగార్జున రెండో వారం హౌస్ లో అస్సలు ఉలుకుపలుకు లేకుండా ఉంటున్న షానీ, అభినయశ్రీలను ఎలిమినేట్ చేసేశారు. ఇక నిన్న హౌస్ లో ఊరికే ఒంటికాలిపై లేస్తూ అందరితో పెద్ద గొడవలు పెట్టుకుంటున్న నేహా చౌదరిని ఎలిమినేట్ చేశారు. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన నేహా ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది.

బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ లోని కంటెస్టెంట్లు అందరినీ ఒక్కసారి పరిశీలిస్తే టాప్ 5 వచ్చే కంటెస్టెంట్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పాలి. అందరూ స్తబ్దుగా ఉండడంతో యాక్టివ్ గా ఉండి.. ప్రేక్షకుల ఆదరాభిమానాలు.. వారి ఓట్ల ఆధారంగా వీళ్లే టాప్ 5లో ఉన్నారని చెప్పొచ్చు..
-టాప్ లో రేవంత్
ప్రతీ వారం ఓటింగ్ పరంగా చూస్తే అందరికంటే టాప్ 1లో ఉంటున్నాడు సింగర్ రేవంత్. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అర్జున్ రెడ్డిలో సయ్యిమని లేస్తూ అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు రేవంత్. అయితే అతడు పెట్టుకునే గొడవలో నీతి నిజాయితీ ఉండడంతో ప్రేక్షకులకు నచ్చుతోంది. జెన్యూన్ కారణంతోనే గొడవకు దిగడంతో అతడికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ టాప్ లో నిలుపుతున్నారు.
–శ్రీహాన్ కామ్ అండ్ కూల్
ఇక రేవంత్ తర్వాత హౌస్ లో కామ్ అండ్ కూల్ కంపోజ్ గా ఆడుతున్నది శ్రీహాన్ అని చెప్పొచ్చు. అతడు టాప్ 5లో ఖచ్చితంగా ఉండే క్యాండిడేట్. అందరితో సరదాగా ఉంటూ.. అందరికి సర్దిచెబుతూ టాస్కుల్లో బాగా ఆడుతూ.. మాట్లాడుతూ సందడి చేస్తున్నాడు.
-కామెడీతో ఫైమా కితకితలు..
ఇక శ్రీహాన్ తర్వాత జబర్ధస్త్ ఫైమా కామెడీతో, గేమ్ లో బెబ్బులిలా పోరాడుతూ ఆకట్టుకుంటోంది. ఫైమా ఆటతీరుకు నాగార్జున కూడా ఫిదా అవుతున్నాడు. అటు కామెడీ.. ఇటు గేమ్ ఉండడంతో టాప్ 5లో ఫైమా ఉండడం ఖాయమంటున్నారు.
-లేడీ పుష్ప గీతూ ఫైర్ బ్రాండ్
ఇక ఈ ముగ్గురితోపాటు లేడీ పుష్ప.. ఫైర్ బ్రాండ్ ‘గీతూ రాయల్’ కూడా టాప్ 5లో ఉండే క్యాండిడేట్ గా చెప్పొచ్చు. ఈమె హౌస్ లో అందరికంటే బాగా ఆడుతోంది. అటు గేమ్స్ పరంగా.. ఇటు కామెడీ పరంగా.. ఆమె వింత చిత్తూరు యాసలో మాట్లాడుతూ ప్రవర్తించే తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. సో టాప్ 5లో ఉండే క్యాండిడేట్స్ లో ఈమె ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
-చంటి లేదా ఆర్జే సూర్య
టాప్ 5లో మిగిలిన ఒక్క స్థానంలో పలువురు పోటీపడుతున్నారు. ఇందులో జబర్ధస్త్ చంటితోపాటు ఆర్జే సూర్య కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు టాప్ 5లోకి వారి ఆటతీరు ఆధారంగా చివరలో వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇక వీరే కాదు.. టాప్ 5లోకి వచ్చే ఛాన్స్ హౌస్ లో మంచివాడిగా అందరినోట ప్రశంసలు అందుకుంటున్న బాలాదిత్య కూడా రేసులో ఉండే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ చివరి వరకూ అతడి ఆటతీరు, ప్రవర్తనను బట్టి టాప్ 5లోకి వెళ్లొచ్చు.
మొత్తంగా బిగ్ బాస్ 6 సీజన్ లో టాప్ 5లోకి చేరే కంటెస్టెంట్లను అంచనావేస్తే రేవంత్ , శ్రీహాన్, ఫైమా, గీతూ లు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో చంటి, సూర్య, బాలాదిత్య సహా మిగతా ఇంటి సభ్యులు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
