Corona: ఎక్కడ పుట్టిందో.. ఎలా పుట్టిందో తెలియదు గానీ కంటికి కనిపంచని కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. కోట్ల మంది శరీరాల్లోకి ప్రవేశించి.. మరికొన్ని లక్షల మంది ప్రాణాలను తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 49 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. అయితే చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఆ తరువాత పలు దేశాలకు విస్తరించింది. వైరస్ విస్తరిస్తుందని గుర్తించే లోపే మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి చేయాల్సిన నష్టాన్నంతా చేసేసింది. దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నవారిలో కరోనా పరీక్షలు నిర్వహించి వారిలో వైరస్ ఉందని నిర్దారించిన తరువాత క్వారంటైన్లో ఉంచి చికిత్స చేశారు. అయితే కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ మొదలైందన్న క్లారిటీ మాత్రం రావడం లేదు. అమెరికా చేస్తున్న పరిశోధనలపై మాత్రం చైనా ఎద్దేవా చేస్తూనే ఉంది. దీంతో కరోనా పుట్టుక గురించి ఇక ఎప్పటికీ తెలుసుకోలేమా..? అన్న చర్చ సాగుతోంది.

చైనాలోని వూహాన్ లో2019 డిసెంబర్ కంటే ముందే కరోనా వైరస్ విస్తరణ ప్రారంభమైంది. అయితే డిసెంబర్ లో దీనిని గుర్తించారు. అప్పటికే చాలా మంది చైనీయుల శరీరాల్లోకి వెళ్లడంతో వారంతా వివిధ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో వారి ద్వారా ఇతరులకు అలా ప్రపంచానికి వైరస్ విస్తరించింది. వూహాన్ లోని ల్యాబ్లో వైరస్ బయటకొచ్చిందని ప్రచారం జరిగినా నిర్దారణమాత్రం కాలేదు. మరోవైపు గబ్బిలాల నుంచి ఈ వైరస్ మొదలైందని భావించారు. కానీ అందుకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పరిశోధకులకు ఈ వైరస్ మూలాలను కనుగోవడం పెద్ద సవాల్ గానే మారింది. అయితే చైనా అధికారులు మాత్రం పరిశోధకుల పనితీరుపై ఎద్దేవా చేస్తున్నారు.
‘వైరస్ మూలాలను కనుగొనడంలో అమెరికా తీసుకుంటున్న చర్యలు హస్యాస్పందంగా ఉన్నాయి. నేరుగా పరిశోధించకుండా నిఘా సంస్థలపై ఆధారపడుతున్నాయి..’ అని వాషింగ్టన్లోని చైనా దౌత్య కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ‘వైరస్ మూలాలను వెతికేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతు ఇస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు. కానీ అమెరికా పరిశోధనపై దృష్టిపెట్టకుండా ఇతర విషయాలపై కేంద్రీకరిస్తుంది.’ అని చైనా అధికారులు అంటున్నారు.
అయితే వైరస్ పై పరిశోధనలు చేస్తున్న క్రమంలో తమకు కచ్చితమైన ఆధారాలు లభించడం లేదని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడీఎస్ఐ) తెలిపింది.కరోనా మూలాలను కనుగొనేందుకు ఈ సంస్థ దర్యాప్తు చేపడుతోంది. అయితే జంతువుల నుంచి మనుషులకు లేదా , వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందని ఈ సంస్థ తెలుపుతోంది. కానీ వాటిపై సరైన అధారాలు లేవని అంటోంది. అమెరికాకు చెందిన మరో నిఘా సంస్థ మాత్రం చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీకైందని అంటోంది. జంతువులపై కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల ఈ వైరస్ బయటకొచ్చినట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆధారాలతో నిరూపించలేమని ఆ సంస్థ పేర్కొంది.
2019లో వైరస్ వ్యాప్తి జరిగిన తరువాత చైనా అధికారులకు సమాచారం అంది ఉంటుందని, అయితే అప్పటికే కరోనా ఇతర దేశాలకు వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా ప్రభుత్వం మాత్రం పరిశోధనలకు అనేక ఆటంకాలు సృష్టిస్తోందని అమెరికా నిఘా సంస్థలు తెలుపుతున్నాయి. వైరస్ మూలాలను కనుక్కోవాలని ప్రెసిడెంట్ బైడెన్ గతంలో ఆదేశాలు జారీ చేయగా.. పలు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.