
దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. కొత్త ప్రైవసీ పాలసీ వల్ల ఈ మధ్య కాలంలో వాట్సాప్ యాప్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా వాట్సాప్ యూజర్లకు మరో భారీ షాక్ తగిలింది. వాట్సాప్ యూజర్లు కొత్తరకం మాల్ వేర్ బారిన పడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వార్మ్ అనే మాల్ వేర్ ను హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల ఫోన్లలోకి పంపుతున్నారని తెలుస్తోంది.
మెసేజ్ లేదా లింక్ ద్వారా ఈ కొత్తరకం మాల్ వేర్ యూజర్ల ఫోన్ లకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా ఈ మాల్ వేర్ ను క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్ లో ఫేక్ యాప్ లు డౌన్ లోడ్ అవుతున్నాయని.. ఈ ఫేక్ యాప్ ల ద్వారా డేటాను చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫేక్ యాప్ లు మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ అయిన తరువాత ఫంక్షన్లు, పర్మిషన్లను ఎనేబుల్ చేయాలని వాట్సాప్ యూజర్లకు నోటిఫికేషన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
మన మొబైల్ లో ఈ మాల్ వేర్ ఉంటే ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేస్తే ఫేక్ యాప్స్ ఉంటే లింక్ లు రిప్లైగా వెళతాయని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చిన ప్రతిసారి బహుమతులను గెలుచుకోండి అంటూ ఫేక్ ఆఫర్లు కూడా కనిపిస్తాయి. యూజర్లకు అనుమానం రాకుండా నకిలీ యాప్ లను కూడా ఒరిజినల్ యాప్ ల లాగానే తయారు చేశారని తెలుస్తోంది. ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని ఫంక్షన్లు, పర్మిషన్లను ఎనేబుల్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి.
మన వ్యక్తిగత డేటా సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ ప్రతినిధి ఒకరు నకిలీ డొమైన్లపై చర్యలు తీసుకోవాలని డొమైన్ ప్రొవైడర్ కు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. నిపుణులు వాట్సాప్ యూజర్లు అనుమానాస్పద మెసేజ్ లను ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.