Sandeshkhali : అసలేంటి సందేశ్ ఖాలీ వివాదం.. ఆ మహిళలను మోడీ ఎందుకు కలవబోతున్నారు?

జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఇదంతా ఎన్నికలకు ముందు ఆడుతున్న నాటకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు.

Written By: NARESH, Updated On : February 22, 2024 10:13 pm
Follow us on

Sandeshkhali : మన తెలుగు మీడియా పెద్దగా ఫోకస్ చేయడం లేదు కానీ.. ఉత్తరాది ప్రాంతం గత కొద్ది రోజులుగా ఆ సంఘటన నేపథ్యంలో అట్టుడికి పోతోంది. ఈ సంఘటన వల్ల అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బిజెపి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సుప్రీంకోర్టులో కూడా ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు అయింది.

అంతటి సంఘటనకు ప్రధాన కారణం సందేశ్ ఖాలీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కీలక నేత షేక్ షాజహాన్ అనుచరులు తమ భూములను కబ్జా చేశారని.. దీనిని ప్రశ్నిస్తే తమను ఇబ్బందులు పెట్టారని.. కొందరిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఇక్కడి మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. వారం క్రితం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళలు మీడియా ముందుకు రావడం.. వారికి బిజెపి మద్దతు పలకడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆ గ్రామానికి ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని పంపించింది. ఆ సభ్యులను తృణ మూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఇదంతా ఎన్నికలకు ముందు ఆడుతున్న నాటకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ బాధిత మహిళలతో కేసులు పెట్టించింది. ఫలితంగా అక్కడి పోలీసులు 18 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

ఈ పరిణామంతో అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలోకి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రావడం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ పర్యటనపై స్టే విధించింది. మరోవైపు ఈ ఘటన జరిగిన సందేశ్ ఖాలీ గ్రామంలో పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నారు. అయితే ఇటీవల బాధితులను కలవడానికి బిజెపి నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో బిజెపి ఎంపీ సుఖాంత మజుందార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పార్లమెంటు సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పార్లమెంట్ సెక్రటే రియట్ ప్రివిలేజెస్ కమిటీ పశ్చిమబెంగాల్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలంటే పార్లమెంట్ సెక్రటరీ, హోం శాఖ, సుఖాంత మజుందార్ కు నోటీసులు జారీ చేసింది.

అయితే సందేశ్ కాలీ ఘటనలో బాధిత మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మార్చి 6న బరాసత్ ప్రాంతంలో బిజెపి మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ప్రదర్శనలో నరేంద్ర మోడీ పాల్గొంటారని తెలుస్తోంది.