
Modi vs Congress : ప్రతిపక్షాలది ‘అదానీ’ ఆందోళనలు అయితే.. అధికార బీజేపీది కాంగ్రెస్ పై ఎదురుదాడి మంత్రం.. ఇలా సభా సమరం మొత్తం నువ్వానేనా అన్నట్టుగా సాగింది. అదానీ అవినీతిని డైవర్ట్ చేసిన మోడీ కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకూ చేసిన అనైతిక విధానాలను సభలో ఎండగట్టి మరీ తూర్పారపట్టారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యాలోపణలతో అధికార–ప్రతిపక్షాలు రక్తికట్టిస్తున్నాయి. నిండు సభలో మాటలు తూటాలు పేలుతున్నాయి. చరిత్రను తవ్విపోసుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గతంలోకంటే భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. గౌతమ్ అదాని మోసాలను వెలికి తీసిన హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు మూడు రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రంగంలోకి దిగిన ప్రధాని మోదీ కాంగ్రెస్ తప్పులను నిండు సభలో ఎండగట్టారు.
జాయింట్ పార్లమెంట్ కమిటీకి పట్టు..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభల రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. దర్యాప్తు జరిపించడానికి అధికార పార్టీ ససేమిరా అంటోంది. విపక్షాలపై ఎదురుదాడికి దిగుతోంది.
నిన్న లోక్‌సభలో.. నేడు రాజ్యసభలో..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తన కౌంటర్ అటాక్‌ను గురువారం కూడా కొనసాగించారు. బుధవారం లోక్ సభలో ఎవరి పేరు ఎత్తకుండా విపక్షాలపై ఎదురుదాడి చేసిన మోదీ.. గరువారం రాజ్యసభలో తీవ్రత పెంచారు. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు కోసం కాంగ్రెస్ పట్టుబట్టగా.. ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను నిండు సభలో ఎత్తిచూపారు మోదీ. నెహ్రూ, ఇందిరాగాంధీ పాలను ఎండగట్టారు.
90 ప్రభుత్వాలలను కూల్చారు..
తాము బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చామంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోందని, ఆ పార్టీ గత చరిత్రను చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయంటూ మోదీ విమర్శించారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, కరుణానిధి ప్రభుత్వాలను కాంగ్రెస్ నాయకులు కూల్చివేశారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో శరద్‌పవార్ ప్రభుత్వాన్ని కూడా గతంలో కూల్చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ధ్వజమెత్తారు. కేరళలో కమ్యూనిస్టుల సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే నాటి ప్రధాని నెహ్రూ దాన్ని పడగొట్టారని గుర్తుచేశారు. 60 ఏళ్ల పాలనలో 90 ప్రభుత్వాలను కూల్చిన రికార్డు కాంగ్రెస్‌కు ఉందని విమర్శించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరు?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు పేరును ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీ.రామారావు చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ ఆయనను గద్దె దించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్‌రావు పేరు ప్రస్తావించకుండానే వెన్నుపోటు రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించారు మోదీ.
ఆర్టికల్ 356 దుర్వినియోగంలో మీకు సాటెవరు?
దేశంలో ఆర్టికల్ 356ను అత్యధికంగా దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ నాయకులేనని మోదీ విమర్శించారు. ఇందులో మీకు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాంగ్రెస్ నాయకులు 90 సార్లు కూలదోశారని ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆర్టికల్ 356ను ఆమె 50 సార్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్నో లోపాలను తనవద్ద పెట్టుకున్న కాంగ్రెస్ తన ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ సభ్యుల నినాదాలు..
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంతసేపు విపక్ష కాంగ్రెస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడుగడునా మోదీ ప్రసంగానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. అయినా ప్రధాని తన రివర్స్ ఎటాక్‌లో ఎక్కడా తగ్గలేదు. దీంతో అదానీ అంశం పక్కకుపోయి ప్రభుత్వాలు కూల్చే అంశం తెరపైకి వచ్చింది.
మొత్తంగా మోడీ లోక్ సభలో కంటే రాజ్యసభలో కాస్త వాడి పెంచారు. ప్రతిపక్షాలు ఆదానీ అవినీతిని ప్రశ్నిస్తే అంతకుమించిన కాంగ్రెస్ తప్పిదాలను మోడీ వల్లెవేశాడు. మాకంటే మీ తప్పులే ఎక్కువ అన్నది నిండు సభలో ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ పరువు తీశాడు