Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్ పై ఉన్న రైలును వెనుక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు భోగీలు నుజ్జునుజ్జయ్యాయి.14 మంది మృతి చెందారు. మరో 33 మంది గాయపడినట్లు రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అక్కడున్న ఆనవాళ్లను పరిశీలిస్తే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన వారే. రాత్రి తో పాటు విపరీతమైన చలి ఉండడంతో క్షతగాత్రులు విలవిల్లాడిపోయారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్ లను తెప్పించి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
ముందుగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పలాస ప్యాసింజర్ బయలుదేరింది. సరిగ్గా కంటకాపల్లి – అల మండల మధ్య సిగ్నల్ కోసం నెమ్మదిగా వెళుతూ 848 కిలోమీటర్ల వద్ద ట్రాక్ పై నిలిచింది. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ఏడాది జూన్లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన మాదిరిగానే. ఇక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం. పలాస గాడు భోగిని రాయగడ ఇంజన్ ఢీకొట్టడంతో ఆ రెండు కనీస ఆనవాళ్లు లేకుండా పోయాయి. అదే సమయంలో పక్క ట్రాక్ లో గూడ్స్ రైలు వెళుతోంది. ఈ భోగీలు గూడ్స్ రైలుపై పడడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. మొత్తం మూడు రైళ్లలో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏకంగా అక్కడ పట్టాలు పైకి తేలిపోయాయి. రాయగడ రైలు దివ్యాంగుల భోగి పట్టాలు తప్పి పొలాల్లో పడిపోయింది.
పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయానికి 14 మంది మృతులను గుర్తించారు. అక్కడ ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 50 కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. విజయనగరం- కొత్తవలస ప్రధాన రహదారికి ప్రమాద ప్రాంతం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్డిఆర్ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. భోగి ల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. క్షతగాత్రులను తరలించడానికి రైలు ట్రాక్ పై కిలోమీటర్ల మేర దూరం నడచి వెళ్లాల్సి వస్తోంది. తీవ్ర గాయాలైన వారిని విశాఖ కేజీహెచ్ కు, స్వల్ప గాయాలైన వారికి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 నిమిషాలకు బయలుదేరింది. రాయగడ ప్యాసింజర్ సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. అయితే అక్కడకు గంట వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురు కావడంతో కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్ పై వెళ్లిందని ప్రయాణికులు చెబుతున్నారు. సిగ్నల్ సమస్య ఎదురు కావడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బాలాసోర్ ప్రమాద ఘటన తర్వాత రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కనివిని ఎరుగని రైలు ప్రమాదంగా రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.