Vaibhav Suryavanshi vs CSK : గత ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు చెన్నై జట్టుతో రాజస్థాన్ ఆడింది. ఆ సమయంలో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ధోనితో మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. అతడి నుంచి షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ధోని అతడిని అడ్డుకున్నాడు. “గొప్పగా ఆడుతున్నావ్.. బలంగా బంతిని కొడుతున్నావ్.. ఇదే స్ఫూర్తిని కొనసాగించు” అని అతనిని అభినందించాడు.

ఆ మాటలను వైభవ్ సూర్య వంశీ సీరియస్ గా తీసుకున్నాడు. మైదానంలో రెచ్చిపోయాడు. విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. తన లోపాలను పూర్తిగా సవరించుకున్నాడు. తర్వాత అండర్ 19 వరల్డ్ కప్ లో విశ్వరూపం చూపించాడు. టీమ్ ఇండియాను విజేతగా నిలిపాడు. అక్కడితోనే ఆగలేదు ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై జట్టుపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 52 పరుగులు చేస్తే.. అందులో బౌండరీల రూపంలోనే 50 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ.
పటిష్టమైన చెన్నై బౌలింగ్ మొత్తాన్ని ఊచ కోత కోశాడు. మరోసారి గౌహతిలో మ్యాచ్ ఆడాలంటేనే భయపడేలా చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టైల్ కలిగిన వైభవ్ మైదానంలో చిరుత పులి మాదిరిగా ఎదురుదాడికి దిగాడు. ఏ బంతిని కూడా వదిలిపెట్టలేదు. గౌహతి స్టేడియం మొత్తం తన నామస్మరణ చేసే విధంగా అతడు షాట్లు కొట్టాడు.. గత ఏడాది జరిగిన ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ కేవలం 17 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. అది కూడా అత్యంత పట్టిష్టమైన గుజరాత్ జట్టు మీద. ఇప్పుడు ఏకంగా చెన్నై జట్టు మీద అతడు తన విధ్వంసాన్ని కొనసాగించాడు.
గుజరాత్ జట్టుకు శాంపిల్ మాత్రమే చూపించానని.. అసలు సినిమా ఇదేనని చెన్నై బౌలర్లకు బ్యాడ్ ద్వారా చెప్పేశాడు. 17 బంతుల్లో గత ఏడాది హాఫ్ సెంచరీ చేస్తే.. ఇప్పుడు 15 బంతుల్లోనే అర్థ శతకం చేసి సరికొత్త రికార్డు వైభవ్ సూర్యవంశీ.
ధోని సలహాలు ఇవ్వకుండా ఉంటే చెన్నై జట్టుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై జట్టులో ధోనీ లేకపోవడం.. బౌలర్లు పూర్తి లయతో బౌలింగ్ వేయకపోవడంతో వైభవ్ సూర్య వంశీ పండగ చేసుకున్నాడని చెన్నై అభిమానులు పేర్కొంటున్నారు. గౌహతి మైదానంపై చెన్నై అభిమానులు జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాన్ని వైభవ్ సూర్య వంశీ మిగిల్చాడని.. ఈ ఓటమి నుంచి కోలు కోవడానికి చెన్నై జట్టుకు చాలా సమయం పడుతుందని ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.