America- Israel: ఇజ్రాయిల్ పై అమెరికా ఆంక్షలా..? అసలేం జరిగింది?

హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ కొద్ది రోజులుగా ప్రతి దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాలస్తీనాలోని పలు నగరాలపై విరుచుకుపడుతోంది. సొరంగాలలో దాక్కున్న హమాస్ తీవ్రవాదులను బందీలుగా పట్టుకుని యుద్ద ఖైదీలుగా తమ దేశానికి తీసుకెళ్తున్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 2, 2024 12:27 pm
Follow us on

America- Israel: తన ప్రయోజనాలకు పూచిక పుల్లంత విఘాతం కలిగినా అమెరికా తట్టుకోలేదు. పైగా జరిగినదాని పై రంధ్రాన్వేషణ చేస్తుంది. దీనినే మన పరిభాషలో నానా యాగి అనొచ్చు. తాజాగా అమెరికా ఇజ్రాయిల్ సెటిలర్ల పై ఆంక్షలు విధించింది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ముమ్మాటికి నిజం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాతో పోటీపడే ఇజ్రాయిల్ సెటిలర్లపై ఆంక్షలు విధించడం ఒకింత విస్మయాన్ని కలిగించినప్పటికీ.. అమెరికా హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పాలస్తీనావాసులపై ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది కాబట్టి.. మధ్య ఆసియా దేశాల్లో ఈ హింస యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. హమాస్ తీవ్రవాదులపై తాము, కలిసి చేసిన దాడులను సమర్ధించుకున్న అమెరికా.. ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులను మాత్రం హింస కోణంలో చూడటం విశేషం. ఈ నేపథ్యంలోనే గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ సెటిలర్లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇజ్రాయిల్ దేశ పౌరులపై అమెరికా అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంక్షలు లో భాగంగా వెస్ట్ బ్యాంక్ నగరంలోని నలుగురు ఇజ్రాయిల్ సెటిలర్లపై అమెరికా ఆర్థిక పరమైన ఆర్థిక పరమైన ఆంక్షలతోపాటు వీసా నిషేధం విధించింది. వీరు పాలస్తీనా వాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అంతేకాదు వారి ఆస్తులను ధ్వంసం చేశారని.. వాటిని లాక్కుంటామని బెదిరించారని ఆరోపించింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్_ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సామాన్య పౌరులపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకుంటే అవి ఏ కోణంలో ఉండాలి? ఆర్థిక పరంగా ఉండాలా? లేక సామాజికపరంగా ఉండాలా? అనే అంశాలను పరిశీలిస్తున్నామని అమెరికన్ అధికారులు పేర్కొన్నారు.

హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ కొద్ది రోజులుగా ప్రతి దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాలస్తీనాలోని పలు నగరాలపై విరుచుకుపడుతోంది. సొరంగాలలో దాక్కున్న హమాస్ తీవ్రవాదులను బందీలుగా పట్టుకుని యుద్ద ఖైదీలుగా తమ దేశానికి తీసుకెళ్తున్నది. ఈ క్రమంలో పాలస్తీనా దేశానికి మద్దతుగా హమాస్ తీవ్రవాదులు ఇతర ప్రాంతాల్లో ఉండి ఇజ్రాయిల్ దేశంపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో పాలస్తీనా ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టింది. ఆ దేశానికి చెందిన పౌరుల్లో కొంతమందిని ఇజ్రాయిల్ సెటిలర్లు చంపేశారని.. వారి కార్లకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందారని పాలస్తీనా ఆరోపించింది. అంతేకాదు తీవ్రమైన దాడులకు పాల్పడుతూ తమ దేశ ప్రజలను ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని అభియోగాలు మోపింది. ఈ అభియోగాల నేపథ్యంలోనే బైడెన్ ప్రభుత్వం ఆంక్షలుకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. మరోవైపు గాజానగరంపై ఇజ్రాయిల్ దళాలు చేస్తున్న దాడుల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆంక్షలు నిర్ణయాన్ని తెరపైకి తెచ్చినట్టు సమాచారం. గాజా నగరంలో ఇజ్రాయిల్ దళాలు చేస్తున్న దాడులతో సామాన్య పౌరులు కూడా చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. అయినప్పటికీ ఇజ్రాయిల్ దళాలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల అమెరికా మందలించినప్పటికీ ఇజ్రాయిల్ పనితీరు లో ఏ మాత్రం మార్పు రాలేదు.

ఇక తమ దేశంలోని ఐరన్ డ్రోమ్ పై హమాస్ దాడులు చేయడంతో.. ఇజ్రాయిల్ సైన్యం వెస్ట్ బ్యాంక్ లోనూ దాడులు మొదలుపెట్టింది. అక్కడ హమాస్ లను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతోంది. ఈ కాల్పుల నేపథ్యంలో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారుతున్నది. దీనిని ఆసరాగా తీసుకుని అక్కడి సెటిలర్లు పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్నారు. అయితే దీనిని ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వారికి ఇజ్రాయిల్ అధికారులు రక్షణ కల్పిస్తున్నారని పాలస్తీనా ఆరోపిస్తోంది. సెటిలర్లు దాడులు చేస్తున్న వెస్ట్ బ్యాంక్ నగరంలో కొంతమందికి అమెరికా పౌరసత్వం ఉంది. కొంతమందికి ద్వంద్వ పౌరసత్వం కూడా ఉంది. అయితే వారెవరు కూడా దాడుల్లో పాల్గొనడం లేదని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. కాగా, అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇంతవరకు ఇజ్రాయిల్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాలస్తీనా నుంచి కూడా ఎటువంటి సానుకూల ప్రకటన విడుదల కాలేదు.