Pakistan- America: ఎప్పటినుంచో నంబర్ వన్ స్థానంలో పాతుకుపోయాక.. హఠాత్తుగా తన పీఠం కిందికి నీళ్లు వస్తే ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని కంటిచూపుతో శాసించే తనకు.. ధిక్కారస్వరం వినిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలాంటి స్థితినే అమెరికా అనుభవిస్తున్నది. చైనా ఏ హే పో అంటున్నది. రష్యా నువ్వెంత నీ లెక్కెంత అని సవాల్ విసురుతోంది. ఉత్తర కొరియా అణు బాంబులు వేస్తాం జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. అమెరికా అంటేనే ధృత రాష్ట్ర కౌగిలి అనే సామెతకు పర్యాయపదం. తనకు అవసరం ఉంటే ఆలింగనం చేసుకుంటుంది. లేకుంటే అగ్గిపెట్టి ఆ మంటలో చలికాచుకుంటుంది. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏ దేశాలతో యుద్ధాలు చేసినా ముందు తన ప్రయోజనాలు చూసుకున్నది. యుద్ధం చేసే ముందు ప్రపంచానికి ఒక మాట కూడా చెప్పదు. అదే ఇతర దేశాలు యుద్ధాలకు దిగితే శాంతి వచనాలు వల్లిస్తూ ఉంటుంది. అమెరికాను చూసి, అమెరికా మార్గాన్ని అనుసరించి ఇప్పుడు రష్యా, చైనా అగ్ర రాజ్యాలుగా ఎదగాలని అనుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రష్యా నాటో దేశాలను కాదని ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. అందులో గెలిచిందా? ఓడిందా? అనేది ఇక్కడ చర్చ అనవసరం.

చైనా కూడా కరోనా బారిన పడుకుంటే ఈపాటికి అమెరికాను దాటేసేది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఏకంగా అమెరికాకే వివిధ రకాలైన వస్తువులను ఎగుమతి చేస్తూ భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని గడిస్తోంది. ఈ చర్చ అటు ఉంచితే సెప్టెంబరు 11 దాడుల తర్వాత బుద్ధుడిలా మారానని చెప్పుకున్న అమెరికా.. చేసిన యుద్ధాలు అన్ని ఇన్ని కావు. కేవలం తనను కాదని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందనే అక్కసు తో పెంచుకొని భారత్ కు బద్ధ శత్రువు అయిన పాకిస్తాన్ కు సైనిక సాయం చేస్తోంది. ఎఫ్_16 యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక పథకానికి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆమోదం తెలపడం కలకలం రేకెత్తిస్తోంది. భారత్ అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా ఈ విషయంలో అమెరికా ముందుకే వెళ్తోంది. పాకిస్తాన్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో ఇప్పటికే ఉన్న ఎఫ్ 16 యుద్ధ విమానాల నిర్వహణను తమ దేశ కంపెనీలు చేపడతాయని అమెరికా అంటున్నది. యుద్ధ విమానాలకు మరమ్మతులు చేయడం, విడిభాగాలను అందించడం వంటివి ఇందులో ఉంటాయి. అయితే యుద్ధ విమానాల్లో కొత్త ఆయుధ వ్యవస్థలను చేర్చడం లేదా కొత్త ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం లేదని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేటివ్ ఏజెన్సీ అంటోంది. టెర్రరిజాన్ని పాకిస్తాన్ సమర్థంగా ఎదుర్కొనేందుకు సహకరించడమే ఈ ఒప్పందం ఉద్దేశమని చెబుతున్నది.
ఇంతకీ ఆ ఒప్పందంలో ఏముంది
పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్ 16 యుద్ద విమానాల నిర్వహణ సేవలను అమెరికా అందిస్తోంది. యుద్ధ విమానాలకు సంబంధించిన హార్డ్ వేర్ ను అందించడంతోపాటు సాఫ్ట్వేర్ లో మార్పులు చేర్పులు చేస్తారు. ఇంజన్లకు మరమ్మతులు చేయడం, విడిభాగాలను అమర్చుతారు. ఈ డీల్ విలువ 450 మిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీ లాక్ హీడ్ మార్టిన్ ఈ సేవలు అందిస్తోంది. పాకిస్తాన్ కు ఎఫ్16 యుద్ధ విమానాల్లో సహాయం చేయడాన్ని నిరసిస్తూ గతంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధికారి “డోనాల్డ్ లు” ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో పాకిస్తాన్ కు మంజూరు చేసిన మూడు బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేశారు. తాలిబన్లు, హక్కానీ నెట్వర్క్ వంటి గ్రూపులను అరికట్టడంలో పాకిస్తాన్ విఫలం అయినందువల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ అన్నారు. ట్రంప్ తర్వాత అధ్యక్షుడైన జో బై డన్ పాకిస్తాన్ విషయంలో ఉదారత చూపడం గమనార్హం.
ఎఫ్ 16 ఎందుకంత ప్రత్యేకం
ఎఫ్ 16 యుద్ద విమానాలను అమెరికా పాకిస్తాన్ తో పాటు బహ్రయిన్, బెల్జియం, ఈజిప్ట్, తైవాన్, డెన్మార్క్, నెదర్లాండ్, పోలాండ్, థాయిలాండ్ వంటి దేశాలకు విక్రయించింది. భారత్ లాంటి పెద్ద దేశాలతోనూ అమెరికా రక్షణ సంబంధాలను కొనసాగిస్తున్నది. అపాచీ హెలికాప్టర్లు విక్రయించేందుకు ఇటీవల రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. వాస్తవానికి రష్యా నుంచే భారత్ ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. కానీ ఇటీవల కాలంలో అమెరికా వంటి దేశాల నుంచి కూడా ఆయుధాలు కొనడం ప్రారంభమైంది. యుద్ధంలో ఎఫ్16 విమానాలను తూర్పు ముక్కలుగా తురుపు ముక్కలుగా అభివర్ణిస్తారు. వీటిని 1972లో జనరల్ డైనమిక్స్ అనే కంపెనీ రూపొందించింది. ఎఫ్ 16 పూర్తి పేరు ఫైటింగ్ ఫాల్కన్. ఒకే ఇంజన్, ఒకే సీటు ఉండే ఈ విమానాలు ధ్వని వేగానికి రెండు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. మిస్సై ళ్లు, బాంబులను ఎక్కడికంటే అక్కడికి మోసుకువెళ్తాయి. కన్నుమూసి కన్ను తెరిచేలోపు లక్ష్యాలను చేదించుకుని వస్తాయి. తర్వాత జనరల్ డైనమిక్స్ కంపెనీని లాక్ హీడ్ మార్టిన్ కొనుగోలు చేసింది.

తాజా పరిస్థితి ఏంటి
జీ _20, క్వాడ్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ వంటికూటముల్లో అమెరికా భారత్ కలసి పనిచేస్తున్నాయి. భారత ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాంగ విధానంలో చాలా మార్పులు చేర్పులు చేశారు. చాలా విషయాల్లో అమెరికా మీద ఆధారపడటం తగ్గించారు. ఇప్పుడు భారత్ కంటే అమెరికాకే మన దేశంతో అవసరం ఎక్కువ. ఇక ఆసియాలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే. కాబట్టి పాకిస్తాన్ తో అమెరికా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోదని ఆ దేశ రక్షణ రంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాకు చైనా పక్కలో బల్లెం లాగా మారడంతో పాకిస్తాన్ కు ఎఫ్16 యుద్ధ విమానాలలో సహాయం చేస్తోందని సమాచారం. భారత్ వైపు మాత్రమే ఉండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలను పక్కన పెట్టాలని అమెరికా అనుకోవడం లేదు. ఒకప్పుడు తాను యుద్ధం చేసిన ఇరాన్ కు దగ్గరగా ఉండే ఈ దేశాలతో సంబంధాలు ఎంత ముఖ్యమో అమెరికాకు బాగా తెలుసు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆసియాలో అమెరికాకు ఒక మంచి స్థావరం కావాలి. అను ఏం చెప్తే దానికి తల ఆడించే దేశం కావాలి. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చైనా వంటి దేశాలపై నిఘా పెట్టాలి. అందుకే పాకిస్తాన్ కు అమెరికా రక్షణ సహాయం చేస్తోంది. పైగా ఇటీవల భారత్ రష్యాకు దగ్గర కావడంతో జీర్ణించుకోలేని అమెరికా.. ఈ విధంగా తన పైత్యాన్ని ప్రదర్శిస్తోంది.