https://oktelugu.com/

Kishan Reddy: యూ ట్యూబర్ తో కేంద్ర మంత్రి ఫుడ్ టూర్.. ఇది కూడా ఓ ఎన్నికల ప్రచారమే..

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. గులాబీ పార్టీ నేతలు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కెసిఆర్ ఉద్యమ సమయంలో కూడా తిరగనంత స్థాయిలో తిరుగుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 19, 2023 12:06 pm
    Kishan Reddy

    Kishan Reddy

    Follow us on

    Kishan Reddy: యూ ట్యూబ్ సర్ఫింగ్ చేస్తుంటే ఆకస్మాత్తుగా ఒక వీడియో కనిపించింది. అందులో ఉన్నది కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అదేంటి కిషన్ రెడ్డి యూట్యూబ్ వీడియోలో కనిపించడం ఏంటి అనే అనుమానం కలిగింది. సరే విషయం ఏంటో తెలుసుకుందామని ఆ లింకు క్లిక్ చేస్తే.. రవి అనే ఓ ఫుడ్ వ్లాగర్ నిర్వహిస్తున్న స్ట్రీట్ బైట్ అనే ఛానల్ లో కిషన్ రెడ్డి కనిపించారు. కనిపించడం మాత్రమే కాదు రవితో కలిసి హైదరాబాద్ లోని కోఠీ ఏరియాలో తిరిగారు. అక్కడి వారితో ముచ్చటించారు. ఇరానీ చాయ్ తాగారు. సమోసా ఆరగించారు. మెట్రో లో ప్రయాణించారు. గోకుల్ చాట్ లో చాట్ తిన్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి హోదా ఉన్నప్పటికీ సగటు హైదరాబాదీ లాగా కిషన్ రెడ్డి స్ట్రీట్ ఫుడ్ ను తృప్తిగా ఆరగించారు. పైకి చూస్తే ఇది హైదరాబాద్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేసినట్టు కనిపిస్తోంది. కానీ అసలు అంతరంగం వేరే ఉంది.

    ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. గులాబీ పార్టీ నేతలు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కెసిఆర్ ఉద్యమ సమయంలో కూడా తిరగనంత స్థాయిలో తిరుగుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి ప్రధాన పార్టీగా ఉన్న బిజెపి పరిస్థితి? ప్రస్తుత కాలానికి అనుగుణంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు టెక్నాలజీ బాట పట్టారు. ఇందుకు తన ఎన్నికల ప్రచారానికి స్ట్రీట్ బైట్ యూట్యూబ్ ఛానల్ ను వేదికగా చేసుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని వివరిస్తూనే.. మోడీ ప్రభుత్వం ఈ తొమ్మిది సంవత్సరాలలో ఏం చేసిందో వివరించారు. బిజెపిలో తన ఎదుగుదల, మోడీతో తనకున్న సాన్నిహిత్యం.. తాను నడిపిన వాహనాలు.. తినే తిండి వీటన్నింటి గురించి కిషన్ రెడ్డి వివరించారు. సాధారణంగా ఒక నాయకుడికి ఇంత స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉండదు. మీడియాలో అయితే లైన్ పాటించాల్సి ఉంటుంది. అదే యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి అలాంటిది ఏమీ ఉండదు. స్ట్రీట్ బైట్ ఛానల్ కు వ్యూయర్స్ కూడా మిలియన్స్ లో ఉండటంతో కిషన్ రెడ్డి ఫుడ్ వ్లాగ్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

    ఇందులో భాగంగా కిషన్ రెడ్డి రవితో కలిసి మెట్రో రైల్ లో ప్రయాణించారు. యువతతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. అయితే గతంలో రాహుల్ గాంధీ కూడా విలేజ్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో మెరిశారు. ఆ ఛానల్ నిర్వాహకులతో కలిసి వంట కూడా చేశారు. అప్పట్లో అది బాగా క్లిక్ అయింది. తమిళనాడు ఎన్నికలకు ముందు ఆ వీడియో చేయడంతో డిఎంకె, కాంగ్రెస్ కూటమికి లాభం చేకూర్చింది. ఏకంగా రాహుల్ గాంధీ పాల్గొన్న వీడియో వ్యూస్ కోట్లను దాటాయి. కిషన్ రెడ్డి కూడా ఆలస్యంగా నైనా యూట్యూబ్ ప్రాధాన్యాన్ని గుర్తించారు కాబోలు.. అందుకే స్ట్రీట్ బైట్ ఛానల్ లో ఫుడ్ వ్లాగింగ్ చేశారు. అంతేకాదు ఆయన అభిప్రాయాలను అత్యంత స్వేచ్ఛగా పంచుకున్నారు. సౌమ్యుడి గా పేరుపొందిన కిషన్ రెడ్డి తన హుందా తనాన్ని వీడియోలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అన్నట్టు ప్రత్యర్థి పార్టీల నాయకులు జనాల్లోకి వేగంగా వెళుతుంటే.. కిషన్ రెడ్డి మాత్రం యూట్యూబ్ ను నమ్ముకున్నారు. సభలు, సమావేశాలకంటే ఇదే నయం అని భావించారా? విమర్శలు, ప్రతి విమర్శలతో కంపు కొడుతున్న రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారా.. ఏదిఏమైనాప్పటికీ కిషన్ రెడ్డి మాటల్లో ఒక హైదరాబాదీ కనిపించాడు. అతడు తినే తిండి లో నిఖార్సైన సంఘ్ కార్యకర్త కనిపించాడు. ఎన్నికల ముందు కిషన్ రెడ్డి చేసిన ఈ ఫుడ్ వ్లాగింగ్ బిజెపికి ఎంతవరకు ఉపకరిస్తుందో ఫలితాలు వస్తే గాని తెలియదు.

     

    Union minister Kishan Reddy garu | Hyderabad Food Tour | | Street Byte | Silly Monks