
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర పుష్కరాలు ఈ సంవత్సరం నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి . పుష్కరము అనగా నదులను కొలిచే భారతీయ పండుగ. మన దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు నదులకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇవి గురుడు ప్రతి సంవత్సరం ప్రవేశించే రాశిని బట్టి ఆ నదికి పుష్కరాలు జరుపుతారు.
గురుడు మకర రాశిలో అడుగు పెట్టినప్పుడు తుంగభద్ర పుష్కరాలు మొదలు అవుతాయి. రామాయణంలో పంపా నదిగా పిలువబడ్డ తుంగభద్రా నది కృష్ణానది ఉపనదులు లో ముఖ్యమైనది. కర్ణాటక రాష్ట్రంలో కూడ్లీ అనే ప్రదేశంలో తుంగ మరియు భద్ర నదులు కలిసి తుంగభద్ర గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
12 సంవత్సరాల ఓకే సారి వచ్చే పర్వదినాన ఎందరో భక్తులు నదీ తీరాలకు వెళ్లి పుణ్యస్నానాలు గావించి భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు హరించి వేయబడతాయి అని భక్తుల నమ్మకం. మునుపటి పుష్కరాలు డిసెంబర్ 9, 2008 లో జరుపబడ్డాయి. పుష్కరాల సందర్భంగా ముఖ్య ప్రాంతాలైన కర్ణాటకలోని హోస్పేట్ ,హంపి, కంప్లి మరియు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం ,కర్నూలు, సుంకేసుల మొదలగు ప్రాంతాలలో స్నానపు ఘాట్లు ఏర్పాటు చేస్తారు. ఈ పుష్కరాలకు ఒక కోటి పైగా భక్తులు పాల్గొనవచ్చని ఒక అంచనా.
అయితే కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం పుష్కరాలపై పడుతోంది. దీంతో గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య మాత్రం కొంతవరకు తగ్గవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.