KCR CBI : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రచ్చ చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకదాని మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. దీంతో కోర్టుకు చేరినా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని రిమాండ్ కు పంపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కేసులో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించినా తెలంగాణ సర్కారు అందుకు ససేమిరా అంటోంది. దీంతో కేసుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు ఎక్కడిది? దానిపై విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి.

సీబీఐ విచారణకు రాష్ట్రం ఎందుకు అడ్డు పడుతోందన్నది ఇక్కడ అందరిలోనూ అనుమానాలు కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలులో నిజానిజాలు బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ చేయించాలని బీజేపీ పట్టుబడుతుంటే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ససేమిరా అంటోంది. దీంతో ఇందులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వారే దొంగలు కాకపోతే ఎందుకు వారు అడ్డుపడుతున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో గులాబీ పార్టీ హస్తం ఉందన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల మధ్య వైరం పెరుగుతోంది. ఒక పార్టీ మరో పార్టీ మనుగడను దెబ్బకొట్టాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ కేసులకు వెళ్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట మసకబార్చాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేసి ఎమ్మెల్యేల కొనుగోలులో తమ ప్రమేయం లేదని చెప్పడంతో అందరి వేళ్లు టీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి.
ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణలో చోటు లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఇదివరకే జీవో చేశారు. తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోర్టును కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే వీలవుతుంది. దీంతో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందా? అసలు ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? అనే విషయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
టీఆర్ఎస్ కావాలనే బీజేపీని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చౌకబారు విధానాలకు తెర తీస్తోందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో బహిర్గతమైనా ఇందులో టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే ఇలాంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వైపు పోతుందో తెలియడం లేదు. విజయం కోసం నేతలు ఇంత దారుణానికి తెగిస్తారా? అని సందేహాలు వస్తున్నాయి. రాజకీయం అంటే అసహ్యం కలిగే స్థాయికి వెళ్లడం అందరికి జుగుస్సా కలిగిస్తోంది. ఒకప్పుడు రాజకీయాలంటే అందరికి ఎంతో గౌరవం ఉండేది. కానీ రానురాను నేతల తీరు వివాదాస్పదంగా మారుతోంది. కేసు కోర్టుకు వెళ్లిన అది ముగిసే వరకు ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటాయో తెలియకుండాపోనుందని పలువురు విమర్శిస్తున్నారు.