TNews Employees strike: కాలం చాలా చిన్నది చిట్టీ. అందరి జీవితాలను తొందరగా మార్చేస్తుంది. ఇప్పుడు ఉద్యోగులకు ‘నమస్తే’ పెడుతున్న సదురు మీడియా దుస్థితి కూడా అంతే.. కరోనా కాటుకు పెద్ద పెద్ద పారిశ్రామిక వృక్షాలే పడిపోయాయి.. ఆఫ్ట్రాల్ ఈ అధికార మీడియా ఎంత? ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి వారే కరోనా దెబ్బకు ఉద్యోగులందరినీ ఇంటికి పంపించాయి. జాలి కరుణ లాంటివేవి లేకుండానే రోడ్డున పడేశాయి. ఇక అధికారంలో ఉన్న పత్రికలు కదా? అందుకే నమస్తే తెలంగాణ, సాక్షి నిలబడ్డాయి. కానీ నిలబడ్డాయంతే.. ఆర్థికంగా కాదు..

కరోనా తర్వాత గడిచిన మూడేళ్లుగా అధికార పార్టీ పత్రికలు, న్యూస్ ఛానెల్ లు జీతాలు పెంచలేదు. సాక్షి సంగతి పక్కనపెడితే నమస్తే తెలంగాణలోకి ఓ కొత్త ఎడిటర్ వచ్చాక వారి పరిస్తితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. చాలా మందిని తీసేయడమో.. ట్రాన్స్ ఫర్ పేరిట మ్యాన్ పవర్ తగ్గించిన ఈ పెద్దమనిషి గడిచిన మూడేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెంచలేదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యన ప్రింటింగ్ సెక్షన్ వారు పత్రికల ప్రింటింగ్ ఆపేసి మెరుపు సమ్మె చేశారు. దీంతో యాజమాన్యం జోక్యం చేసుకొని జీతాలు దసరా వరకూ పెంచుతామని హామీనిచ్చి సద్దుమణిగారు.
ఇప్పుడు నమస్తే తెలంగాణ వంతు వచ్చింది. అధికార పార్టీ ఛానెల్, బోలెడంత డబ్బు, పరపతి, చానెల్ కు యాడ్స్ ఉన్నా కూడా అందులోని ఉద్యోగులకు మూడు ఏళ్లుగా జీతాలు లేవట.. ఎదురుచూసి చూసీ.. విసుగు చెందిన ఉద్యోగులు తాజాగా మెరుపు సమ్మెకు దిగారు. ఆఫీసులోనే కూర్చొని నిరసన తెలిపారు. ఇది వీడియో తీసి షేర్ చేయడంతో అధికార పార్టీ మీడియా పరువు పోయింది.
అధికారంలో ఉండి.. అంతంత డబ్బు పరపతి ఉండి.. యాడ్స్ కూడా వస్తున్నా ఉద్యోగులపై ఇంత శీతకన్ను వేసిన యాజమాన్యానికి ఇప్పటికీ సెగ తగిలింది.ఉద్యోగులంతా మెరుపు సమ్మెకు దిగడంతో ఆ చానెల్ పరువు పోయినట్టైంది.
ఈనాడు, జ్యోతి లాంటి సంస్థలు ఇప్పటికే ఖర్చు తగ్గించుకొని.. ఉద్యోగులను సాగనంపి ఉన్నదాంట్లో చేసుకుంటున్నాయి. కానీ నమస్తే బీరాలకు పోయి ఉద్యోగులను ఉంచుకొని మూడేళ్లుగా జీతాలు పెంచకపోవడంతో ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఎన్నో రోజులు ఇలా నిర్బంధంగా పనిచేయించలేరన్న వాస్తవం ఇప్పటికైనా తెలిసివస్తే మంచిది. లేదంటే ఇది టీ న్యూస్ కు, కేసీఆర్ పార్టీకి కూడా దెబ్బపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.