Homeప్రత్యేకంDwarabandhala chandrayya: చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘చంద్రయ్య దొర వీరగాథ ఇదీ

Dwarabandhala chandrayya: చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘చంద్రయ్య దొర వీరగాథ ఇదీ

Dwarabandhala chandrayya: ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం..భారతదేశానికి స్వాతంత్ర్యం. భారతీయుల స్వేచ్ఛావాణి వెనుక ఎందరో తమ రక్తాన్ని ధారబోశారు. అలుపెరగని పోరాటం చేశారు. అందులో కొందరు యోధులు చరిత మాత్రమే వెలుగులోకి వచ్చింది. అందులో విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు సాగించిన స్వాతంత్ర్య పోరాటం యావత్ భారతావనిని కదిలించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది.కానీ అంతకంటే ముందుగానే ఎంతోమంది ఆదిమ జాతి వీరులు సైతం తమ పరాక్రమంతో బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయారు. తెల్లదొరల సామ్రాజ్య, నిరంకుశత్వ, కుటిల, కుతంత్ర, కుట్ర, స్వార్థ విష కోరల నుంచి భరతమాతను విముక్తి కల్పించడానికి గట్టి పోరాటమే చేశారు. కానీ దురదృష్టం కొలదీ వారి చరిత్ర బయటకు రాలేదు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు ద్వారబంధాల చంద్రయ్య దొర. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1860 సెప్టెంబరు 10న జన్మించిన చంద్రయ్యదొర అల్లూరి సీతారామరాజు కంటే ముందుగానే ఓ మహోన్నత ఉద్యమానికి సారధ్యం వహించారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పెకిలించే ప్రయత్నం చేశారు. అల్లూరి మన్యం పితూరి కంటే 40 ఏళ్లు ముందుగాను రంప పితూరి నడిపినా వీరుడిగా చంద్రయ్య దొరను గుర్తించకపోవడం చారిత్రక తప్పిదమే. ఆ వీరుడు నేలకొరిగి నేటికి 142 సంవత్సరాలవుతోంది. చంద్రయ్య దొర పోరాట ఆనవాళ్లను పరిశోధించి ..ఆయన చరిత్రను ప్రపంచానికి వెలుగుచూపారు కోటిపల్లి సుబ్బారావు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ ఆ మహనీయుడు పరాక్రమం వెలుగుచూడడం మన అదృష్టం.

Dwarabandhala chandrayya
Dwarabandhala chandrayya

వారి ఆగడాలు తట్టుకోలేక…

బొబ్బిలి ప్రాంతంలో పుట్టిన చంద్రయ్యదొర పెరిగింది మాత్రం తూర్పుగోదావరి జిల్లాలోనే. శంఖవరం మండలం నెల్లిపూడిలో తన మేనమామల ఆధీనంలో పెరిగాడు. తుపాకీ కాల్చడం, విలువిద్య, కర్రసాము, గుర్రపు స్వారీలో చంద్రయ్య దొర మంచి ప్రవీణుడు. అంతకంటే మొండివాడు. తనకంటే పరాక్రమవంతుడు కనిపిస్తే చాలూ.. కఠోర సాధన చేసి ఓడించే వరకూ నిద్రపోయే వాడు కాదు. చంద్రయ్య దొర మేనమామలు రవణం వారు నెల్లిపూడి ప్రాంతంలో పెత్తందారిలుగా ఉండేవారు. పిఠాపురం జమిందార్లకు ప్రతినిధులుగా వ్యవహరించే వారు. పన్నుల వసూలు చేయడం, ఆ ప్రాంతంలో వ్యక్తిగత, సామాజిక సమస్యలు పరిష్కరించడం వంటివి వారే చూసేవారు. అయితే చంద్రయ్యదొరకు యుక్త వయసు వచ్చినప్పుడు భీకరమైన కరువు రాజ్యమేలింది. కలరా, మశూచి, ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందాయి. సకాలంలో వైద్యం అందక వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. అటువంటి సమయంలో కూడా సంస్థానాధీశులు పన్నుల కోసం ప్రజలను పిప్పిచేసేవారు. జలగల్లా పీల్చుకు తినేవారు. పన్ను కట్టని వారి పొలాలు,పశువులు, చివరికి వ్యవసాయ పనిముట్లను సైతం వేలం వేసేవారు. దీంతో చాలామంది పొట్ట చేతిపట్టుకొని ఉన్న ఊర్లను, సొంత గ్రామాలను విడిచిపెట్టి సుదూర ప్రాంతాలు వలసపోయేవారు. అటు బ్రిటీష్ పాలకులకు తొత్తులుగా మారిన సంస్థానాధీశులు, జమిందార్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పట్డారు. ఈ క్రమంలో మహిళలపై అకృత్యాలు అధికమయ్యాయి. అటు బ్రిటీష్ పాలకులు సైతం ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలపై ఉక్కుపాదం మోపేవారు. వీటన్నింటినీ చూసిన చంద్రయ్య రక్తం మరిగింది. అసలే పౌరుష వంతుడు కావడంతో వారిపై తిరగబడ్డాడు. చింతాకుల అక్కయ్య ఇంటి వద్ద పెద్దిపాలెం మీద తొలి తిరుగుబాటు చేశాడు. ఒక వైపు పోరాడుతునే కరువు రోజులు కావడంతో విరివిగా గంజి సత్రాలు స్థాపించాడు. అవి పేద గిరిజనుల ఆకలిని తీర్చాయి.

అటు ఖమ్మం.. ఇటు ఒడిశా వరకూ..

తూర్పుగోదావరి మన్య ప్రాంతంలో ప్రారంభమైన చంద్రయ్య పోరాటం. అటు ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలతో పాటు అటు మధ్యప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించింది. గిరిజనులు, హరిజనులు, బడుగు, బలహీనవర్గాలను సంఘటితం చేసిన చంద్రయ్యదొర బ్రిటీష్ వారికి సవాల్ విసిరారు. ఎన్నో పోరాటాలు చేసి విజయవంతమయ్యారు. తెల్లదొరల కంట్లో నలుసుగా మారారు. కారం తమ్మన్నదొర, పులిచింత సాంబయ్య, అంబుల్ రెడ్డి వంటి యోధులతో చేయి కలిపిన చంద్రయ్య దొర సామ్రాజ్యవాదుల దోపిడిని ప్రతిఘటించడం ప్రారంభించారు. ప్రజా ప్రతిఘటనను తీసుకొచ్చారు. అటు మన్యంలో గిరిజనులను, ఇటు మైదానంలో రైతులను సంఘటితం చేసి పోరాటబాట పట్టించారు. తిరుగుబాటు ఉగ్రరూపం దాల్చింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1879లో చంద్రయ్య దొర తిరుగుబావుటా ఎగరేశాడు. రంపచోడవరంలో ప్రారంభమయిన రంప పితూరీ భద్రాచలం, రేకపల్లి, కొయ్యూరు, గోలుకొండ ప్రాంతాలకు విస్తరించింది.

Dwarabandhala chandrayya
Dwarabandhala chandrayya

డబ్బు, పదవీ ఆశ చూపినా..

రోజురోజుకూ చంద్రయ్య దొర ప్రాబల్యం పెరిగిపోతోంది. అటు ప్రజల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది. పీడిత ప్రజలు చంద్రయ్యదొరను ఆరాధ్య దైవంగా చూడడం ప్రారంభించారు. దీంతో బ్రిటీష్ పాలకుల్లో కూడా భయం ప్రారంభమైంది. తమ పాలనకు చరమగీతం పాడతాడని వారు భావించారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య దొరను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అటు పదవి, డబ్బు ఆశ చూపడం ప్రారంభించారు. వాటి ద్వారా లోబరచుకోవడానికి ప్రయత్నించారు. చంద్రయ్య తిరుగుబాటును సద్దుమణిగించడానికి కలెక్టర్ ఆయనకు ముఠా పదవి ఇవ్వడానికి ప్రతిపాదించగా… అందుకు ఆయన తిరస్కరించారు. సంస్థానాధీశ పదవిని ఆశ చూపినా, భార్య సీతమ్మ ఒత్తిడి చేసినా చంద్రయ్య ససేమిరా అన్నారు. పదవిని తిరస్కరించడంతో బ్రిటిషు వారు ఆయనను ఎలాగైనా బంధించి చంపాలనుకొని అతని బురద కోట స్థావరాన్ని బలగాలతో ముట్టడించి కాల్పులు జరిపారు. గాయాలతో బయటపడిన చంద్రయ్య రహస్యంగా శరభవరం పారిపోయాడు. దాడి తర్వాత ఆయన 1879, ఏప్రిల్లో అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశాడు. దానికి ప్రతీకారంగా ప్రభుత్వం చంద్రయ్య అనుచరులను 79 మందిని కాల్చి వేసింది. కారం తమ్మన్న దొరను కిరాతకంగా చంపి రాజమండ్రి పరిసరాల్లో పడేసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.

మత్తుమందు భోజనం పెట్టి…

చంద్రయ్య దొర ఉద్యమంలా ముందు సాగుతుండడంతో ఆంగ్ల ప్రభుత్వాన్ని కూలదోస్తాడని బెంగ పట్టుకుంది. దీంతో నిఘా పెంచి ఆయనను సజీవంగా, లేక నిర్జీవంగా పట్టిచ్చిన వారికి వేయి రూపాయలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. దీంతో చంద్రయ్య మారు వేషంలో తిరుగుతూ ఉండేవాడు. అడవిదారిలో ధాన్యం, పప్పుదినుసుల బండ్లను అడ్డగించి, వాటిని పేద ప్రజలకు పంపిణీ చేసేవాడు. బంధువులు సహకారంతో చంద్రయ్య దొరను బంధించి చంపేయాలని కలెక్టర్, పిఠాపురం, కాట్రావులపల్లి, కోలంక, కిర్లంపూడి జమీందారులు ఒక పథకం వేశారు. కిర్లంపూడిలో చంద్రయ్య సమీప బంధువు ఏనుగుల వెంకటస్వామి ఇంట్లో మత్తు మందు కలిపిన భోజనం తినిపించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బ్రిటిష్ సైనికులు అతడి చేతులకు, కాళ్లకు బేడీలు వేసి కిర్లంపూడి ఏనుగుల వీధి, రామకోవెల దక్షిణ దిశగా ఉన్న రావి చెట్టుకు వేలాడదీసి ప్రజలందరి సమక్షంలో తుపాకులతో 1880, ఫిబ్రవరి 23న కాల్చి చంపారు. దీంతో ఓ మహోన్నత శిఖరం నెలకొరిగింది. కానీ ఆయన స్ఫూర్తి సజీవంగా నిలిచింది. అక్కడికి నాలుగు దశాబ్దాల తరువాత అల్లూరి రూపంలో మరో చరిత్రకారుడు, యోధుడు, ఉద్యమకారుడు పుట్టుకొచ్చాడు. .

వెలుగులోకి తెచ్చిన కోటిపల్లి…

Dwarabandhala chandrayya
Dwarabandhala chandrayya

అయితే ఇంతటి మహోద్యమాన్ని నడిపిన చంద్రయ్య దొర చరిత్ర ఇంతవరకూ వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరం.ఇన్నాళ్లకు ఆయన చరిత్రను తన పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చారు కోటిపల్లి సుబ్బారావు. దీంతో చంద్రయ్య దొర పరాక్రమం బయట ప్రపంచానికి తెలిసింది. అల్లూరి కంటే ముందుగానే భారతీయుల స్వేచ్ఛావణి కోసం ఒక యోధుడు పోరాడాడన్న విషయం భావితరాలకు సుపరిచితమైంది. అటు ప్రభుత్వాలు కూడా మేలుకొన్నాయి. అంతటి మహోన్నత యోధుడుకు అంజలి ఘటించడం ప్రారంభించాయి. భారతీయ తపాలా శాఖ వారు శనివారం ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో కూడిన తపాలా చంద్రికను శుక్రవారం నాడు విడుదల చేసింది. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వాటిని ఆవిష్కరించారు. అయితే ఒక యోధుడు పరాక్రమం శతాబ్ధంన్నర కాలం తరువాత వెలుగుచూడడం మాత్రం అత్యంత దురదృష్టకరం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version