KCR Telangana CS selection : ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ ఏ అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఏపీలో రాజకీయ లెక్కలు వేసుకునే ఆయన తెలంగాణలో నియామకాలు చేపడుతున్నారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ అకాల నిష్క్రమణతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యంగా మారింది. ఉదయం కోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ కు నమ్మకమైన అధికారిగా పేరున్నా.. న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏపీ బాట పట్టాల్సి వచ్చింది. అయితే ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలని కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. చాలా మంది సీనియర్లు ఉన్నా 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక వెనుక ఏపీలో కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నిలిచారు. 2019 వరకూ ఆమె సీఎంవోలో సెక్రెటరీగా ఉన్నారు. ఆరోగ్య, పరిశ్రమల శాఖను పర్యవేక్షించేవారు. చాలా కీలకంగా వ్యవహరించేవారు. అయితే ఆమెకు సీఎంవో నుంచి ఉన్నపలంగా బదిలీ చేశారు.కొన్నిరోజుల పాటు హెల్త్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అటు తరువాత అటవీ శాఖకే పరిమితం చేశారు. అయితే ఆమె పరిధిలో ఉన్న శాఖ రివ్యూలను శాంతికుమారికి తెలియకుండా చేస్తున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. సీనియర్ అధికారిగా ఉన్న అడుగడుగునా అవమాన పరుస్తున్నారన్న టాక్ నడిచింది.అటువంటి మహిళా అధికారికి ఏకంగా సీఎస్ బాధ్యతలు అప్పగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమె కంటే సీనియర్లు ఉన్నా శాంతికుమారి వైపే కేసీఆర్ మొగ్గుచూపడానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆమె కేవలం కాపు సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం వల్లే ఆమెకు పెద్దపీట వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడంపై పడ్డ కేసీఆర్ కాపు అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.
ఇలా శాంతికుమారి పేరు ప్రకటించారో లేదో.. సాయంత్రానికి ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, జనసేన సలహాదారుడు అయిన తమిళనాడు మాజీ సీఎస్ ఆర్.రామ్మోహనరావు, పార్ధసారధి తదితరులు కేసీఆర్ ను కలుసుకున్నారు. శాంతికుమారి ఎంపికపై అభినందించారు. తాజా నియామకంతో ఏపీలో బీఆర్ఎస్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందోనని చర్చించారు. దీంతో ఇది పక్కా పొలిటికల్ వ్యూహంతో సాగినట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం కాపు సామాజికవర్గాన్ని ఏపీలో తనవైపు తిప్పుకునేందుకు సీనియర్లకు కాదని శాంతికుమారిని సీఎస్ బాధ్యతలు అప్పగించడంపై ఐఏఎస్ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అయితే మున్ముందు ఏపీ రాజకీయాల కోసం ఎన్నెన్నో నియామకాలు జరిపే చాన్స్ ఉందన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో విస్తరిస్తోంది.