Pawan Kalyan: ప్రజాభిమానం నిండుగా ఉన్న నాయకుడు ప్రజల్లోకి వస్తే ఇంకా ఏమైనా ఉందా? మీద పడిపోతారు. పవన్ కళ్యాణ్ లాంటి వారినైతే జనాల్లో వదిలేస్తే అభిమానులు ఎగబడిపోతారు. అందుకే పవన్ వస్తే బందోబస్తు కాస్త గట్టిగానే ఉంటుంది. తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే బాధితుల ఇళ్ల వద్దకు వస్తుంటే అశేషమైన పవన్ ఫ్యాన్స్ అడుగడుగునా పవన్ కోసం పోటెత్తుతున్నారు. వారందరినీ దాటుకొని వెళ్లడం పవన్ కు కష్టసాధ్యమవుతోంది.

భారీగా పోలీస్ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చుట్టూ బాడీ గార్డులు.. పదుల సంఖ్యలో పోలీసుల స్టిక్ట్ కారిడార్ మధ్య పవన్ ముందుకు సాగారు. అయినా జనం తోసుకుంటూ పవన్ ను కలవాలని ఆరాటపడుతూనే ఉన్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారం అవుతోంది.
ఈ క్రమంలోనే పవన్ నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఎగబడ్డ అభిమానుల తాకిడీకి పవన్ కు రక్షణగా ఉన్న ఒక పోలీస్ అధికారి కిందపడిపోయాడు. దాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ పోలీస్ ను లేపి మరీ యోగక్షేమాలు తెలుసుకొని ముందుకు సాగాడు.
ఇలా పవన్ కళ్యాణ్ అంత బిజీలోనూ ఓ పోలీస్ కిందపడిపోతే స్పందించిన తీరు.. ఆయనలోని మానవత్వానికి మచ్చుతునకగా చెప్పొచ్చు. పవన్ ఇలా తోటి వారిపై చూపే ప్రేమ, కరుణనే ఆయనను గొప్ప మనిషిగా తీర్చిదిద్దింది. ఇలాంటి ఘటనలతోనే పవన్ కళ్యాణ్ లోని రియల్ హీరో బయటకు వస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.