Chess Player Pragyananda : విభిన్నమైన ఎత్తులతో అనుభవజ్ఞులను చిత్తుచేస్తూ.. ఊహకందని వ్యూహాలతో పావులు కదుపుతూ.. వినూత్నమైన మేధస్సుతో ప్రత్యర్థి ఆట కట్టిస్తూ.. చిరుప్రాయంలోనే అసాధారణ ఆటతీరుతో అబ్బురపరుస్తూ.. 64 గళ్ల ఆటలో మరో యువరాజు వచ్చాడు..నాటి ‘ఆనందా’న్ని మరిపిస్తూ ప్రపంచ వేదికపై మెరిశాడు. ఫైనల్లో నెంబర్‌వన్ కార్ల్‌సన్ చేతిలో ఓడినా.. చెన్నై కుర్రాడు అందరి మనసులు గెలిచాడు.. పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రపంచక్‌పలో పతకం సాధించి అరుదైన చరిత్రను లిఖించాడు.. యావద్భారతానికి అంతులేని ‘ప్రజ్ఞానందా’న్ని అందించాడు.
చెన్నైలో రమేశ్‌బాబు, నాగలక్ష్మి దంపతులకు 2005లో జన్మించిన ప్రజ్ఞానంద.. అక్క నాగలక్ష్మిని చూసి చదరంగంపై మక్కువ పెంచుకున్నాడు. నాగలక్ష్మి కూడా అంతర్జాతీయ క్రీడాకారిణే. నాగలక్ష్మి చిన్నప్పుడు టీవీలో కార్టూన్లు ఎక్కువగా చూసేది. దీంతో ఆ చిన్నారి దృష్టిని ఏదైనా ఆటపైకి మళ్లించాలన్న ఆలోచనతో కూతురుకు నాగలక్ష్మి చెస్ నేర్పించడం మొదలుపెట్టింది. కోచ్‌ల దగ్గర శిక్షణ ఇప్పించడంతో వైశాలి జాతీయ స్థాయిలో రాణించింది. అక్క సాధిస్తున్న అద్భుతమైన విజయాలను చూస్తూ పెరిగిన ప్రజ్ఞానంద కూడా చదరంగ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రముఖ కోచ్ ఆర్.బి రమేశ్‌బాబుకు చెందిన చెస్ గురుకుల్‌లో వీరు శిక్షణ తీసుకుని రాటుదేలాడు.
ప్రజ్ఞానంద ఎదుగుదలలో కుటుంబం పాత్ర చాలా కీలకం. బ్యాంకు ఉద్యోగైన రమేశ్‌బాబు తనకొచ్చే జీతంతోనే కొడుకు, కూతురు టోర్నీల్లో ఆడేందుకు అవసరమైన ఆర్ధికపరమైన వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇక, పిల్లల వెంటే ఈవెంట్లకు వెళ్తూ వారికి కావాల్సిన సదుపాయాలన్నీ తల్లి నాగలక్ష్మి చూసుకునేది. హోటళ్లలో భోజనం ఖరీదైనది కావడంతో తనతో పాటు ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్, బియ్యం, మసాలాలు తీసుకెళుతూ పిల్లలకు సాంబారు, పెరుగన్నం పెట్టేదాన్నని నాగలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎల్లప్పుడూ ప్రజ్ఞానంద వెంటే ఉంటూ అమ్మగా కొడుకులో నైతిక స్థయిర్యాన్ని నింపేది. తాజాగా బాకులో జరిగిన ప్రపంచక్‌పలోనూ ప్రజ్ఞానందతో పాటే పోటీలకు వెళ్లి కుమారుడి విజయంలో తన ప్రత్యేకతను చాటింది నాగలక్ష్మి. ఇలా అన్ని విధాలా తల్లిదండ్రులు అండగా నిలవడంతో ప్రజ్ఞానంద కేవలం ఆటపైనే
ప్రజ్ఞానంద అత్యంత చిన్న వయసు నుంచే చదరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించిన ప్రజ్ఞానంద.. 2013లో అండర్-8 వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ గెలిచాడు. దీంతో ఫిడే మాస్టర్స్ హోదా అందుకున్నాడు. 2015లో అండర్-10 వరల్డ్ టైటిల్ సాధించాడు. 2016లో అంటే… 10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకొన్నాడు. 2018 జూన్‌లో ఇటలీలో జరిగిన గ్రెడిన్ టోర్నీలో ప్రదర్శనతో గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అతి పిన్న వయసులోనే జీఎం హోదా అందుకున్న ఆల్‌టైమ్ రికార్డు ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. గత గురువారమే 18వ పుట్టినరోజు జరుపుకొన్న ప్రజ్ఞానంద.. ప్రపంచ నెంబర్‌వన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అది.. 2021.. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌లైన్ టోర్నీ.. మహామహులైన అంతర్జాతీయ స్టార్లు బరిలో ఉన్న ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేని ఓ పదహారేళ్ల కుర్రాడు.. పన్నెండేళ్లుగా ప్రపంచ చెస్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న అత్యంత ప్రతిభావంతుడైన మాగ్నస్ కార్ల్‌సన్ అతడికి ప్రత్యర్థి. అతడిని ఓడించడం అసాధ్యమన్నది చెస్ విశ్లేషకుల అంచనాలు. దీనికితోడు ఆ కుర్రాడు ఆడాల్సింది నల్లపావులతో. ఇలా పరిస్థితులన్నీ ఆ కుర్రాడికి ప్రతికూలమే. ఆట మొదలైంది. మెల్లిమెల్లిగా ఆ కుర్రాడు అనూహ్యమైన ఎత్తులతో ముందుకొచ్చేస్తున్నాడు. కార్ల్‌సన్ వెనకబడిపోతున్నాడు.. 39వ ఎత్తు వద్ద పూర్తిగా చేతులెత్తేసి తన ఓటమిని అంగీకరించాడు. ఆనంద్, హరికృష్ణ తర్వాత కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత ఆటగాడిగా ఆ కుర్రాడు చరిత్ర సృష్టించాడు. అంతే, క్రీడాలోకం మొత్తం అతడివైపు తలెత్తి చూసింది. జేజేలు పలికింది. అతడే ప్రజ్ఞానంద. అలా అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించడం అలవాటుగా మార్చుకున్న ప్రజ్ఞానంద.. ఆ తర్వాత 3 నెలల్లోనే మరో రెండుసార్లు కార్ల్‌సన్‌పై గెలిచి ఎత్తుల్లో తనను మించిన మొనగాడు లేడని నిరూపించాడు.