Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. పాలమూరు పై డైలమా

ఢిల్లీ నుంచి విడుదలైన జాబితాలో జహీరాబాద్ స్థానానికి సురేష్ కుమార్ షట్కార్, నల్లగొండ స్థానానికి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బాలరాం నాయక్ కు టికెట్లు ఖరారయ్యాయి.

Written By: NARESH, Updated On : March 8, 2024 9:59 pm
Follow us on

Congress : పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే బిజెపి తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి కూడా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి పరిమితమైంది. అయితే ఆ పార్టీ కూడా శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పచ్చ జెండా ఊపడంతో.. తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి శుక్రవారం సాయంత్రం తొలి జాబితా విడుదలైంది. ఇందులో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

ఎవరెవరంటే..

ఢిల్లీ నుంచి విడుదలైన జాబితాలో జహీరాబాద్ స్థానానికి సురేష్ కుమార్ షట్కార్, నల్లగొండ స్థానానికి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బాలరాం నాయక్ కు టికెట్లు ఖరారయ్యాయి. ఇక ఈ జాబితాలో పాలమూరు స్థానానికి సంబంధించి డైలమా నెలకొంది. ఇటీవల పాలమూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వంశీచంద్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వంశీచంద్ రెడ్డి పేరు ప్రకటించినప్పటికీ అధిష్టానం పాలమూరు స్థానాన్ని హోల్డ్ లో ఉంచడం విశేషం.

వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ

ఏఐసీసీ కీలక నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి పోటీ చేయబోతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక కన్నడ హీరో శివ రాజ్ కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ పార్టీ శివమొగ్గ స్థానం కేటాయించింది. గత ఏడాది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ రాజ్ నంద్ గావ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటిస్తున్నారు. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థుల పట్ల జాతీయ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.