BJP Politics : వాలితో పోరాడేవాడి బలం ఎదురు పడగానే సగం అయిపోతుంది. అది రామాయణం. రాజకీయాల్లో బీజేపీ ఎత్తుగడలు కూడా ఇలాగే ఉంటాయ్. యంత్రాంగం, వ్యవస్థ గుప్పిట్లో ఉంటాయ్. మీడియా అండతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తది. దీనికితోడు కొన్ని తోక పార్టీలు రంగంలోకి దిగుతాయ్. ఉపఎన్నికల్లో ఈ బ్యూటీ మరోసారి బయటపడింది.

బీహార్‌లో నితీశ్ వీడి పోయాక రెండు చోట్ల ఉప ఎన్నికలు. ఒకటి ఆర్జేడీ గెలిచింది. మోకామా… అది ముందు నుంచి బీజేపీకి అచ్చిరాదు. మిత్ర పక్షాలకు ఇచ్చేసేది. ఇప్పుడు ఓడింది. రెండో సీటు గోపాల్ గంజ్. ఇది బీజేపీ సిట్టింగ్. ఎమ్మెల్యే మరణించడంతో వచ్చింది ఉప ఎన్నిక. 1,800 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ ఎఐఎంకు 12,300 ఓట్లు, బీఎస్పీకి 9 వేల ఓట్లు వచ్చాయ్. అదీ అచ్చులో బొమ్మ. బీఎస్పీ నిజానికి యూపీలో ఊపలేదు. మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు. కానీ ఇలాంటి చోట్ల పోటీ చేసి ఓట్లు చీల్చేస్తది. ఇక ఓవైసీ ఒప్పందానికి కట్టుబడతాడు తిరుగులేదు. ఒకచోట గెలిచారు కాబట్టి సేఫ్. మహా ఘట్ బంధన్ ప్రభావం లేదు అని ప్రచారం చేయొచ్చు. గోపాల్ గంజ్ లో పోటీ చేసింది లాలూ యాదవ్ బావమరిది భార్య కాబట్టి… ఆర్జేడీది జంగిల్ రాజ్ అని దెప్పిపొడవొచ్చు. ఎనిమిదేళ్లుగా మనం ఏం పొడిచామో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇక కులాసాగా ఉండొచ్చు.
ఇవే తోక పార్టీలు మహారాష్ట్రలో అంధేరీ వెస్ట్ లో మాత్రం పోటీ చేయలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ పోటీలో లేదు. వీళ్లు అవసరం లేదన్న మాట. శివసేనను చీల్చి చంపుడు పందెం వేసింది బీజేపీ. అంధేరీ థాకరేల స్ట్రాంగ్ హోల్డ్. వచ్చే నెలలోనే బీఎంసీ ఎన్నికలు ఉన్నాయ్. ఇలాంటి సమయంలో రంగంలోకి దిగి భంగపడితే బీఎంసీలో ఎదురు కొడుతుంది. అందుకే అక్కడ బీజేపీ ఓ మహత్తరమైన సాకు చెబుతోంది. సేన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన ఎన్నికలో పోటీ చేయదట! అది పార్టీ సంప్రదాయం కాదట. మరి ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోతే గత ఏడాది కాలంలో రెండు ఉప ఎన్నికలు జరిగాయ్. ఇక్కడ బీజేపీ బరిలో దిగి నోటాతో పోటీ పడింది. అదేంటో ఇక్కడ సంప్రదాయం గుర్తు లేదు బీజేపీకి. జాతీయ పార్టీ అయినా వీధికో విధానం ఉంటుందేమో..
ఇక మునుగోడు సంగతి. ఇక్కడ శక్తియుక్తులన్నీ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అప్పడాల కర్రలు, రోడ్డు రోలర్లు లాంటి కారును పోలిన గుర్తులు రంగంలోకి దింపింది. ప్చ్ వర్కవుట్ కాలేదు. టీఆర్ఎస్ మీద కూడా సింపథీ లేదు నిజానికి. కాంగ్రెస్ పూర్తిగా నీరసపడింది అక్కడ. అయినా బీజేపీ గెలవలేదు అంటే ఉపఎన్నిక ఎత్తుగడకి చెక్ పడినట్టే అనుకోవాలేమో .. ఇంకా ఏడాదిలోనే తెలంగాణ ఎన్నికలు. కాబట్టి ఇక ఇలాంటి చిన్నెలు కనిపించకపోవచ్చు.
మొత్తానికి బీజేపీ జబ్బలు చరవడం వెనక చాలా తతంగం ఉంటుందని ఈ ఉపఎన్నికలు మరోసారి రుజువు చేశాయ్. అదీ అట్లుంటది బీజేపీతోని.. ముందుగానే చెప్పినట్టు దానిదంతా “వాలీ, సగం బలం సిద్దాంతం”