South India States : ప్రజాస్వామ్యం అంటే ప్రజలే. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ నీతిమాలిన రాజకీయాల వల్ల, రీతిలేని నాయకుల వల్ల జనంలో ఏవగింపు మొదలవుతుంది. అది తిరస్కారానికి దారితీస్తుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల విషయంలో అదే నిరూపితమైంది. అంతేకాదు జనం నాడిని అనుసరించి పాలన చేయకపోతే ఫలితం ఎలా ఉంటుందో కూడా బిజెపికి అర్థమైంది. కర్ణాటక ఎన్నికలకు ముందు చాలామంది హంగ్ వస్తుందని, జెడిఎస్ కీలక పాత్ర పోషిస్తుందని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా కర్ణాటక ఓటరు గుంభనంగా ఫలితం చెప్పేశాడు. అంతేకాదు ఏకపక్షంగా మద్దతు ఇచ్చి క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలికాడు.
సౌత్ మూడ్ ఇది
వాస్తవానికి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు అస్థిరతకు మారుపేరు.. 2018 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ చిన్న చిన్న ఆటుపోట్లు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన నాయకులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీ వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిపించుకుంది. పైకి చూస్తే ఈ విధానం మొత్తం పారదర్శకంగా కనిపించినప్పటికీ.. కోరుకొని ఎన్నికలు రావడంతో ప్రజలకు విరక్తి కలిగింది. అందుకే ఈసారి అలాంటి ఫలితం పునరావృతం కాకుండా ఉండేందుకు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టారు. ఇదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ
ఇక ఏపీలోనూ 2019లో దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన టిడిపి జగన్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ తనకు అలవాటైన అవకాశవాద రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించాడు. పరుగు పార్టీ నుంచి 23 మందిని లాగేసుకోవడంతో ప్రజల్లో ఒక రకమైన భావం ఏర్పడింది. చివరికి మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని ప్రజలు 2019లో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని తీర్పు ఇచ్చారు. ఏ 23 మందిని అయితే లాగేసుకున్నాడో.. అదే సంఖ్యలో టిడిపి అభ్యర్థులను గెలిపించారు. జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు.
తెలంగాణలో ఇందుకు విరుద్ధం
ఇక సౌత్ లో మరో కీలక రాష్ట్రమైన తెలంగాణలో ప్రజలు 2018 ఎన్నికల్లో ఏకపక్షంగానే తీర్పు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అంతంతమాత్రంగా ప్రజలు మెజారిటీ ఇచ్చారు. అయితే తన ప్రభుత్వాన్ని కూలగొడతారనే భయంతో కెసిఆర్ ఫిరాయింపులకు పాల్పడ్డాడు. టిడిపి, కాంగ్రెస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నాడు. అంతేకాదు ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీశాడు. పైగా ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడంలో విజయవంతమయ్యాడు. ఆ విషయాన్ని ప్రతిపక్షాలు ఆలస్యంగా గుర్తించాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే తెలంగాణలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే పథకాలు అమలు కావని లేనిపోని భయాలు కల్పించడంతో 2018లో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపులకు పాల్పడింది. తెలివిగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి గూబ గుయ్యిమనే తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూతురినే ఓడించారు. కర్ణాటక తర్వాత త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇక్కడి ప్రజలు అక్కడి వారి మాదిరిగానే తీర్పు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “అయితే ఇక్కడ గతంలో హంగ్ లాంటి తీర్పులు వచ్చేవి. ప్రజలు కూడా తమ రాష్ట్రానికి ఏది మంచిదో ఏది మంచిది? ఏది కాదు? నిర్ణయించే స్థితికి వచ్చారు. కాబట్టి హంగ్ లాంటి” తీర్పులు ఇవ్వబోరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
ఇక తమిళనాడు, కేరళ లోనూ ప్రజలు ఒక్క పార్టీకే పట్టం కట్టారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పక్షం రెండవసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. జయలలిత ఆధ్వర్యంలో అన్న డీఎంకే రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చినప్పటికీ.. రెండోసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే అనారోగ్యంతో కన్నుమూశారు.