Homeఆంధ్రప్రదేశ్‌YCP: చేజేతులా ఆ వర్గాలను వదులకున్న వైసీపీ..వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే..

YCP: చేజేతులా ఆ వర్గాలను వదులకున్న వైసీపీ..వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే..

YCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని 20 నెలలు కూడా లేవు. ప్రధానంగా రెండో సారి అధికారంలోకి రావడానికి జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. అందుకే తనకు తాను సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. అటు జాతీయ సర్వే సంస్థలు సైతం సర్వే చేసి నివేదికలిస్తున్నాయి. పర్వాలేదు అన్న మాటే కానీ సూపర్ అని మాత్రం సదరు సర్వే సంస్థలు చెప్పడం లేదు. గట్టెక్కుతారు కానీ 2019 ఎన్నికలంతా స్పీడ్ ఉండదని మాత్రం సర్వే సంస్థలు తేల్చిచెబుతున్నాయి. అయితే ఇవి నిజం కావచ్చు..కాకపొవచ్చు కానీ కొంతవరకూ క్షేత్రస్థాయిలో మాత్రం సర్వేలు పరిస్థితిని తెలియజేస్తాయి.ఇంకా ఎన్నికలకు వ్యవధి ఉంది కాబట్టి కొన్ని సమస్యలను అధిగమించే చాన్స్ ఉంటుంది. దానిని పార్టీలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం కొంతవరకూ ఫలితముంటుంది. లేకుంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోక తప్పదు. అధికార వైసీపీ విషయానికి వస్తే మాత్రం 2019 ఎన్నికల నాటి పరిస్థితి ఉండదని సొంత పార్టీ వారే విశ్లేషిస్తున్నారు. జస్ట్ సంక్షేమ పథకాలు తప్పిస్తే పాలనలేదని ఆ పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల మాదిరిగా పరిస్థితి ఉండబోదని.. భారీగా శ్రమించాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు.

YCP
YCP, jagan

ఆ వర్గాల సపోర్టుతో..
ఒక విధంగా చెప్పాలంటే 2019 ఎన్నికలు జగన్ ప్రభంజనమే వీచింది. జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నివర్గాల ప్రజలు గుంపగుత్తిగా పనిచేశారు. ఒక్క ఛాన్స్ అన్న మాట ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. విశేషంగా ఆకట్టుకుంది కూడా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా అన్నివర్గాల నుంచి జగన్ కు ఆదరణ అయితే దక్కింది. చివరకు మైనార్టీలు, కాపులు కూడా జగన్ సీఎంపై పీఠంపై కూర్చోవాలని ఓటు వేశారు.ఇలా అన్నివర్గాల ప్రజల మద్దతుతోనే కనివనీ ఎరుగని రీతిలో 151 సీట్లు సాధించి జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ రివర్స్ అవుతూ వస్తోంది. తాము ఏం ఆశించి జగన్ కు ఓటు వేశామో..అది కనిపించకపోయేసరికి వారంతా కొంత అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఒక్కో వర్గం దూరమవుతూ వస్తోంది.

Also Read: Tomato Flu Outbreak in India: భారత్ లో మరో వైరస్ కలకలం

కమ్మ అంటే టీడీపీయేనా?
ఇలా ఫస్ట్ దూరమైన వర్గం కమ్మసామాజిక వర్గం. అమరావతి రాజధాని విషయంలో కమ్మ కులస్థులను టార్గెట్ చేయడంతో వారిలో అసంతృప్తి ప్రారంభమైంది. అమరావతి కాదు కమ్మరాజ్యం అంటూ వైసీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేయడంతో వారు విరక్తి చెందారు. వారి కులాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కించపరచడంతో వారు వైసీపీకి దూరం జరిగిపోయారు. వారి సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో ఇప్పుడు వైసీపీ అంటేనే కమ్మ సామాజికవర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో పాటు ఇతర జిల్లాల్లో ఎక్కువ మంది కమ్మ సామాజికవర్గం వారు వైసీపీ వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ఏలుబడిలో తమ సామాజికవర్గానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని భావించిన వారు జగన్ తో ఆ ముచ్చట తీర్చుకోవాలని భావించారు. దాని ఫలితమే కమ్మ సామాజికవర్గం ప్రభావమున్న నియోజకవర్గాల్లో సైతం వైసీపీ గెలుపొండం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వారంతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కమ్మ అంటేనే టోటల్ టీడీపీ అన్న రాంగ్ గైడన్స్ వైసీపీకి ఇబ్బందులు తెచ్చి పెట్టనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కంఫర్టుగా లేని క్షత్రియులు, వైశ్యులు
బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలు కూడా ఏమంత కంఫర్టుగా లేవు. ఈ రెండు వర్గాలూ 2019 ఎన్నికలో వైసీపీ పక్షాన నిలిచాయి. కానీ గత మూడేళ్ల వైసీపీ పాలనలో వీరికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు.వీరి విషయంలో వైసీపీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదన్న విమర్శలైతే ఉన్నాయి. బ్రాహ్మణులకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కకపోవడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. కనీసం నామినేటెడ్ పదవులు సైతం కేటాయించలేదు. గతంలో చంద్రబాబుపై బ్రాహ్మణ వ్యతిరేకి ముద్ర ఉండేది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించకపోవడంతో చంద్రబాబును బ్రాహ్మణులు పెద్దగా నమ్మలేదు. కానీ ఆయన చిత్తశుద్దితో బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటుచేశారు. నిధులు కేటాయించారు. బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి కృషిచేశారు. కానీ జగన్ ఆ ప్రయత్నమూ చేయలేదు. ఉన్న కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. ఉత్సవవిగ్రహంలా మార్చారు. అందుకే జగన్ కంటే చంద్రబాబే నయమని బ్రాహ్మణులు ఒక డిసైడ్ కు వచ్చారు. వైశ్య సామాజికవర్గం వారి పరిస్థితి అదే. తొలి మంత్రివర్గంలో జగన్ వైశ్యులకు స్థానమిచ్చిన మలి విస్తరణలో మాత్రం ఉన్న పదవిని తొలగించారు. కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవులు సైతం కేటాయించలేదు. వైశ్యులకు ప్రత్యేక పథకమంటూ ఏదీ లేదు.

YCP
YCP, jaan

రాజులపై దాడులతో..
క్షత్రియ సామాజికవర్గానిది అదే పరిస్థితి. గత ఎన్నికల్లో వారు జగన్ వైపు మొగ్గుచూపారు. కానీ గత మూడేళ్లలో ఆ సామాజికవర్గానికి పెద్ద దెబ్బలే తగులుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుపై కక్ష సాధింపునకు దిగడం వైసీపీలోని ఆ సామాజికవర్గ నేతలకే రుచించలేదు. చరిత్రను మంటగలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా వారిని బాధించింది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పోలీసుల దాడులు కూడా ఆ వర్గానికి కలవరపాటుకు గురిచేశాయి. అందుకే వైసీపీ క్షత్రియ సామాజికవర్గం వారు దూరం జరుగుతూ వస్తున్నారు.

‘కాపు’ కాసినా..
కాపు సామాజికవర్గం వారి విషయంలో కూడా వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరు విమర్శలకు గురిచేసింది. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు కల్పించిన రిజర్వేషన్లను సైతం జగన్ రద్దుచేశారు. పైగా కాపు రిజర్వేషన్ అనేది తన పరిధిలో లేదని జగన్ చేతులెత్తేశారు. దీనికితోడు అయినదానికి కానిదానికి కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగాను తిట్టిన వ్యక్తికి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. ఎన్నికల ముందు కాపుల విషయంలో జగన్ వ్యవహరించిన తీరుకు.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మారిన వ్యవహార శైలిని కాపులు తప్పుపడుతున్నారు. అందుకే వైసీపీకి దూరం జరుగుతూ వస్తున్నారు. పవన్ కు దగ్గరవుతున్నారు.

రాంగ్ గైడన్స్ తో..
అయితే సామాజికవర్గ లెక్కలు వేసుకునే వైసీపీ ఇలా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గం వారు టీడీపీకి, కాపు సామాజికవర్గం వారు జనసేనకు, క్షత్రియ, వైశ్య సామాజికవర్గం వారు బీజేపీకి సపోర్టు చేస్తారని ముందే ఫిక్సయిపోయింది. అయితే వారంతా దూరమైతే వచ్చే ఎన్నికల్లో తాను అధికారానికి దూరమవుతానని జగన్ ఆలోచించడం లేదు. ఇంకా ఎన్నికలకు వ్యవధి ఉన్న వేళ ఇటువంటి విషయంలో మాత్రం ఆలోచించకపోతే మాత్రం ఎన్ని సర్వేలు అనుకూల ఫలితాలు ఇచ్చినా.. తుది ఫలితం మాత్రం భిన్నంగా వస్తుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.

Also Read:Junior NTR- Amit Shah: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటి: ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా జూ.ఎన్టీఆర్..? ఓకే అంటే పగ్గాలే?

 

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular